నిత్యావసర వస్తువుల కల్తీకి చెక్.. హైడ్రా తరహాలో స్పెషల్ ఫోర్స్.. సెర్చ్, సీజ్, భారీగా ఫైన్లు

Wait 5 sec.

ప్రస్తుతం మార్కెట్‌లో ఏ వస్తువు చూసినా కల్తీమయంగా మారిపోయింది. తినే తిండి దగ్గరి నుంచి తాగే నీటి వరకు అన్నీ కల్తీలు చేస్తున్నారు. ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువులను కల్తీ చేసి.. కొందరు కేటుగాళ్లు భారీగా సొమ్మును వెనకేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతీ వస్తువులోనూ కల్తీ జాడలు ఉండటంపై సర్కార్ సీరియస్‌గా పరిగణించింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కల్తీలకు చెక్ పెట్టేందుకు ఏకంగా ఒక స్పెషల్ ఫోర్స్‌ను తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ముఠాల ఆటకట్టించేందుకు ఈ స్పెషల్ ఫోర్స్ చర్యలు చేపట్టనుంది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ప్రభుత్వ ఆక్రమణలు, చెరువులు కుంటల్లో ఏర్పాటు చేసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ.. పెను సంచలనం సృష్టిస్తూ.. కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న .. డ్రగ్స్, గంజాయి సహా మత్తు పదార్థాల ముఠాల పాలిట శత్రువుగా మారిన లాగానే వస్తువుల్లో కల్తీని నియంత్రించేందుకు ఒక పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టింది. అయితే ఈ స్పెషల్ ఫోర్స్ కేవలం తనిఖీలు మాత్రమే చేయకుండా.. కల్తీ కేటుగాళ్లపై సెర్చ్ అండ్ సీజ్ ఆపరేషన్లు నిర్వహించడం, వారికి భారీగా జరిమానాలు విధించేలా విశేషమైన అధికారాలను కట్టబెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు.రెవెన్యూ, మున్సిపల్, హెల్త్, పోలీస్ శాఖల అధికారులతో కలిసి ఏర్పాటు చేయనున్న ఈ స్పెషల్ ఫోర్స్‌కు ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని బాస్‌గా నియమించే ఆలోచనను రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఈ స్పెషల్ ఫోర్స్ ఏర్పాటుకు సంబంధించి.. ఇప్పటికే సమగ్ర ప్రతిపాదనలు రెడీ అయ్యాయి. హైదరాబాద్‌లో చెరువుల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఏ రకంగా ఉక్కుపాదం మోపుతోందో.. అదే విధంగా కల్తీ దందాపైనా దూకుడుగా వ్యవహరించేలా ఈ కొత్త ఫోర్స్‌ను తయారు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌లో తక్కువ మంది సిబ్బంది ఉండటంతోపాటు.. వారికి నామమాత్రపు అధికారాలు ఉండటంతో కల్తీగాళ్ల ఆటకట్టించడంలో సఫలం కాలేకపోతున్నారు. అదే సమయంలో కల్తీ చట్టంలో ఉన్న లొసుగులను ఉపయోగించుకుని నిందితులు తప్పించుకుంటున్నారు. ఇలాంటివి దృష్టిలో పెట్టుకుని.. ఆ స్పెషల్ ఫోర్స్‌కు సర్వాధికారాలు కల్పించాలని సర్కార్ భావిస్తోంది. మార్కెట్లో దొరికే పాలు, నూనెలు, మసాలాల దగ్గరి నుంచి హోటళ్లలో లభించే ఆహార పదార్థాల వరకు ప్రతి ఒక్క వస్తువుపై ఈ ఫోర్స్ నిరంతర నిఘా పెట్టనుంది.ఈ స్పెషల్ ఫోర్స్‌కు ఆయా వస్తువుల శాంపిల్స్ సేకరించే అధికారం మాత్రమే కాకుండా.. నేరుగా ఆ వస్తువుల తయారీ కేంద్రాలపై దాడులు చేయడం.. ఆ వస్తువులు, సంబంధిత హోటల్‌ను కూడా సీజ్ చేసేలా చట్టపరంగా అధికారాలు ఇవ్వనున్నారు. కల్తీకి పాల్పడే వారి లైసెన్సులను రద్దు చేయడంతోపాటు వారికి రూ.కోట్లల్లో పెనాల్టీలు విధించి.. ఇంకోసారి అలాంటి కల్తీలకు పాల్పడకుండా చూసేలా రూల్స్‌ను కఠినతరం చేస్తున్నారు. ఈ కల్తీల వెనుక ఎంతటి పెద్ద వారి అండదండలు ఉన్నా.. వదిలిపెట్టకూడదనే స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. కల్తీ వస్తువుల నిందితులపై నాన్ బెయిలెబుల్ కేసులు పెట్టేలా ఆ స్పెషల్ ఫోర్స్‌కు ప్రత్యేక న్యాయ విభాగాన్ని కూడా అనుసంధానం చేయనున్నారు. ఈ క్రమంలోనే ఈ స్పెషల్ ఫోర్స్‌ను ఎలా తయారు చేయాలి.. దానికి నిధుల కేటాయింపు, చట్టపరమైన అధికారాలకు సంబంధించి సుదీర్ఘ చర్చ జరిపి రిపోర్ట్‌ను రెడీ చేశారు. త్వరలోనే ఆ రిపోర్ట్‌కు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసి.. అమల్లోకి తీసుకువచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.