రూ. 2 కోట్లు పెడితే ఇప్పుడు రూ. 5 వేల కోట్లు.. NSE ఐపీఓతో ఎస్బీఐకి కాసుల పంట.. ఇదేం మ్యాజిక్కూ!

Wait 5 sec.

: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు (SBI) లాభాల పంట పండనుంది. అదేంటీ.. ఇదెలాగూ నంబర్ వన్ బ్యాంక్.. భారీగానే లాభాలు వస్తాయంటారా? అయితే కస్టమర్లకు అందించే సేవలు, కార్యకలాపాల వల్ల వచ్చే లాభాలు కావు ఇవి. అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజీగా ఉన్నటువంటి NSE ఐపీఓకు వస్తున్న నేపథ్యంలో ఎస్బీఐకి కాసుల పంట పండుతోంది. అదేంటీ.. ఈ రెండింటికీ సంబంధం ఏంటి అనుకుంటున్నారా? అదే చూద్దాం పదండీ. ఎస్బీఐ వంటి పెద్ద పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర బ్యాంకులు, దేశీయ పెట్టుబడిదారులకు ఇతర సంస్థల్లో కూడా వాటాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎస్బీఐకి కూడా NSE లో భారీగా వాటా ఉంది. ఎన్ఎస్ఈ ఇక ఐపీఓకు రాబోతున్న తరుణంలో ఎస్బీఐ అందులో వాటా విక్రయం చేపట్టనుంది. దీంతో లాభాలు రాబోతున్నాయి. ప్రాథమిక ముసాయిదా పత్రాల్ని (డ్రాఫ్ట్ పేపర్స్- DRHP) దాఖలు చేసింది. పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) విధానంలో ఐపీఓను నిర్వహించనుంది. అంటే కొత్తగా ఫ్రెష్ ఈక్విటీ షేర్లను జారీ చేయట్లేదు. ఓఎఫ్ఎస్ అంటే సంస్థలోని వాటాదారులు, షేర్ హోల్డర్లు తమ వాటాల్ని విక్రయించనున్నారన్నమాట.ఈ ఐపీఓ కోసం NSE లో సుమారు 6 శాతం వాటా విక్రయించనున్నట్లు తెలుస్తుండగా.. దాదాపు రూ. 30 వేల కోట్ల వరకు నిధుల్ని సమీకరించాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది. దీని ప్రకారం చూస్తే భారత్‌లో హ్యుందాయ్ మోటార్ ఇండియాను దాటి అతిపెద్ద ఐపీఓగా అవతరిస్తుంది. ఇంకా కంపెనీ విలువ దాదాపు రూ. 5 లక్షల కోట్లుగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. రూ. 2 కోట్ల పెట్టుబడితో 2.47 కోట్లకుపైగా షేర్ల కొనుగోలు..6 శాతం వాటా మొత్తం ఎస్బీఐ ఒక్కటే విక్రయించదు. ఇతర వాటాదారులు కూడా ఇందులో భాగంగా ఉన్నారు. ఎస్బీఐ NSE ఐపీఓ కోసం దాదాపు 2,47,50,000 (2.47 కోట్లు) షేర్లను విక్రయిస్తోంది. చాలా వరకు 1993- 1999 లోనే ఈ షేర్లను ఎస్బీఐ కొనుగోలు చేసింది. అప్పుడు సగటన ఒక్కో షేరు ధర కేవలం 80 పైసలుగానే ఉంది. మొత్తం కలిపి 2.47 కోట్లకుపైగా షేర్ల కోసం రూ. 2 కోట్ల వరకు వెచ్చించింది. రూ. 5 వేల కోట్ల లాభం..ఇక బుధవారం రోజు NSE అన్‌లిస్టెడ్ మార్కెట్ క్లోజింగ్ ప్రైస్ చూస్తే ఒక్కో షేరు ధర రూ. 2055 వద్ద ఉంది. దీంతో ఇప్పటి ధర లెక్కన ఎస్బీఐ 2.47 కోట్లకుపైగా షేర్లను విక్రయిస్తే రికార్డు స్థాయిలో ఈ బ్యాంకుకు రూ. 5086.13 కోట్లకుపైగా రానున్నట్లు చెప్పొచ్చు. పెట్టుబడి రూ. 2 కోట్లను తీసేసినా రూ. 5 వేల కోట్లకుపైగానే లాభం వస్తుందన్నమాట. ఈ లెక్కన చూస్తే 2568 రెట్ల లాభం పొందనుంది. శాతం పరంగా చూస్తే 2,56,775 శాతం ప్రాఫిట్ ఇది. ఎస్బీఐ సంగతి ఇలా ఉంటే.. న్యూ ఇండియా అష్యురెన్స్ కంపెనీ లిమిటెడ్, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, టెమాసెక్ హోల్డింగ్స్, మోర్గాన్ స్టాన్లీ వంటివి కూడా భారీగానే లాభాలు పొందనున్నాయి. ఇవన్నీ కూడా చాలా తక్కువ ధరకే గతంలో NSE లో వాటాల్ని కొనుగోలు చేశాయి.