లోక్‌సభ నియోజకవర్గాల పెంపుపై నారా లోకేష్ ట్వీట్.. కాంగ్రెస్ ముఖ్యనేతలకు కౌంటర్

Wait 5 sec.

డీలిమిటేషన్‌ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు.. మరీ ముఖ్యంగా దక్షిణాది పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లు తగ్గి.. పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిథ్యం తగ్గుతుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ మాత్రం.. ఈ ఆరోపణలను ఖండిస్తోంది. డీలిమిటేషన్‌కు మద్దతు పలికిన టీడీపీ.. లోక్‌సభ నియోజకవర్గాల పెంపుపై ఇప్పటికే ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేయగా.. ఎక్స్ వేదికగా మంత్రి ట్వీట్లు వదులుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలె కాంగ్రెస్ నేతల ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి లోకేష్.. తాజాగా హస్తం పార్టీ ముఖ్య నేతలైన జైరామ్ రమేష్.. శశి థరూర్‌లను ట్యాగ్ చేస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే అత్యంత ప్రముఖ నాయకుల్లో ఒకరైన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. డీలిమిటేషన్ గురించి ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని గుర్తు చేసిన నారా లోకేష్.. ప్రజలకు మెరుగైన ప్రాతినిధ్యం కల్పించేందుకు లోక్‌సభ సభ్యుల సంఖ్యను వెయ్యికి పెంచాలని ఆయన సూచించారని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకించడం వల్ల.. అప్పుడు ప్రణబ్ ముఖర్జీ చెప్పింది తప్పా అని ప్రశ్నించారు. లేకపోతే రాజకీయాలకే ప్రాధాన్యతనిస్తూ కాంగ్రెస్ పార్టీ.. దేశ ప్రయోజనాల విషయంలో తన వైఖరిని మార్చుకుందా అని నిలదీశారు. ఈ నేపథ్యంలోనే లోక్‌సభ సీట్ల పెంపు విషయంలో మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ప్రణబ్‌ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నేషనల్ మీడియాలో వచ్చిన వార్తను నారా లోకేష్ పోస్ట్‌ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక ఇటీవల లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై ఢిల్లీలో ఇచ్చిన ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లను 50 శాతం పెంచడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఎక్స్‌ వేదికగా తీవ్రంగా ఖండించిన శశిథరూర్‌.. ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లోని 80 మంది ఎంపీలకు.. కేరళలోని 20 మంది ఎంపీల సంఖ్యకు భారీగా తేడా లేదని అనిపిస్తుండవచ్చు కానీ.. డీలిమిటేషన్‌లో 50 శాతం సీట్ల పెంపు తర్వాత యూపీలో 120 ఎంపీలు.. కేరళలో 30 మంది మాత్రమే ఎంపీలు ఉంటారని లెక్కలతో సహా వెల్లడించారు. అప్పుడు పరిస్థితి ఏంటని.. ఇది ఉత్తర, దక్షిణ రాష్ట్రాల్లో భారీ తేడాకు దారితీస్తుందని తెలిపారు. అయితే శశిథరూర్‌ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే స్పందించిన మంత్రి నారా లోకేష్.. డీలిమిటేషన్‌ వల్ల దేశంలోని అన్ని రాష్ట్రాలకు సమాన ప్రయోజనాలు అందుతాయని స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజనతో ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యం పెరుగుతుందని చేస్తున్న వాదనల్లో నిజం లేదని.. ఏ రాష్ట్రానికీ అదనంగా ప్రయోజనాలు అందవు అని అన్నారు. జీతాల లెక్క.. ఓట్ల శాతం లెక్క వేరు అని పేర్కొన్న నారా లోకేష్.. జీతాల పెంపు సూత్రం ఇందులో వర్తించవు అని తేల్చి చెప్పారు.