కృష్ణలంక సాయికృష్ణ ఇంటికి మాజీ సీఎం జగన్.. పోలీసులు, జనసేన నేతలపై సంచలన వ్యాఖ్యలు

Wait 5 sec.

విజయవాడకు చెందిన యువకుడు గాదె సాయికృష్ణ మిస్సింగ్ అంశం రాజకీయ మలుపు తీసుకుంది. కృష్ణలంక‌కు చెందిన సాయికృష్ణను పోలీసులే లాకప్‌లో కొట్టి చంపారనే ఆరోపణల నేపథ్యంలో ఏపీ రాజకీయం వేడెక్కింది. దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో సాయికృష్ణ కుటుంబసభ్యులను మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. గురువారం మధ్యాహ్నం కృష్ణలంక‌లోని అతడి ఇంటికి వెళ్లిన మాజీ సీఎం జగన్.. సాయికృష్ణ తల్లిని ఓదార్చారు. ఆమెతో మాట్లాడి, ధైర్యం చెప్పిన జగన్.. అన్ని విధాలుగా కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.అనంతరం అక్కడ జగన్ మీడియాతో మాట్లాడుతూ... ‘‘విజయవాడ నడిబొడ్డున దారుణం జరిగింది.. చంద్రబాబు ప్రోత్సహిస్తున్న కొందరు పోలీసుల వల్లే ఇలా జరుగుతోంది.. ఒక సీఐ స్టేషన్ పరిధిలో నెలలో రెండు చావులు.. మే 9 నుంచి సాయికృష్ణ తల్లడిల్లిపోతోంది..సాయికృష్ణ ఘటనపై సీబీఐ విచారణ జరగాలి.. సీఐ సస్పెన్షన్ కేవలం కంటితుడుపు చర్య మాత్రమే.. సీఐను అరెస్ట్ చేయకుండా సాయి తల్లితో బేరాలాడుతారా? పోలీసులు, జనసేన నాయకులు ఆమెను ప్రలోభపెడుతున్నారు.. ఏసీపీ, సీపీ సహా అందరి పాత్ర తేలాలి’’ అని డిమాండ్ చేశారు.గత నెల నుంచి సాయికృష్ణ జాడ కనిపించకపోవడంతో దీని వెనుక పోలీసులు ఉన్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ బిడ్డను పోలీసులే ఏదో చేశారని సాయికృష్ణ తల్లి ఆరోపించారు. పోలీస్ స్టేషన్‌లో పోలీసులే అతడ్ని కొట్టి చంపారని మాజీ మంత్రి అంబటి రాంబాబు సహా వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ అంశంపై జాతీయ మానవహక్కుల కమిషన్‌కు విజయవాడ మాజీ ఎంసీ, వైసీపీ నేత కేశినేని నాని ఫిర్యాదు చేశారు. అలాగే, లోక్‌భవన్‌కు వెళ్లిన వైసీపీ నేతలు.. డీఎస్సీతో పాటు సాయికృష్ణ అంశంపై గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు.కాగా, మే 9న మార్కాపురం నుంచి తమ బిడ్డను పోలీసులు తీసుకెళ్లారని, అప్పటి నుంచి ఇంటికి రాలేదని, గాలిస్తున్నామని కుటుంబసభ్యులు చెబుతున్నారు. తమ బిడ్డ ఏమయ్యాడో అని పోలీసులను అడిగితే.. ‘నీ కొడుకు ఇక లేడనుకో’ అంటూ సీఐ నాగరాజు సమాధానమిచ్చారని తెలిపారు. మరోవైపు, సాయికృష్ణ తల్లి హైకోర్టును ఆశ్రయించి, హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. జూన్ 29 లోపు సాయికృష్ణను తమ ముందు హాజరుపర్చాలని పోలీసులను ఆదేశించింది.ఇక, సాయికృష్ణ మిస్సింగ్ వెనుక సీఐ నాగరాజు ఉన్నారని ఆరోపణలు రావడంతో ఆయనను సస్పెండ్ చేశారు. మరోవైపు, ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీవ్రంగానే స్పందించారు. ఐపీఎస్ అధికారితో దర్యాప్తు చేయాలని ఆదేశించారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.