Gold Bond Scheme: చాలా మంది బంగారంపై ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇక్కడ ఎన్నో మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లోనే ఒకటి సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్బీఐ పసిడి బాండ్లు జారీ చేస్తుంటుంది. గతంలో తరచుగా జారీ చేసేది. నెలలో పలుమార్లు ఇష్యూ చేసేది.. క్రమక్రమంగా తగ్గిస్తూ త్రైమాసికానికి ఒకసారి ఇష్యూ చేస్తూ వచ్చింది. తర్వాత బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఖజానాపై అధిక భారం పడుతుందన్న కారణంతో దీనిని తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే ఇక్కడ కొత్తగా బాండ్లను ఇష్యూ చేయకపోయినా.. గతంలో జారీ చేసిన వాటికి మాత్రం డబ్బులు చెల్లించాల్సి వస్తోంది.ఇక గోల్డ్ బాండ్ స్కీమ్ కాల పరిమితి 8 ఏళ్లు కాగా.. ఐదేళ్ల తర్వాత ముందుగానే డబ్బులు తీసుుకునేందుకు వీలుంటుంది. బంగారం ధర పెరుగుతున్న కొద్దీ రాబడి పెరుగుతుంటుంది. కనీసం గ్రాము నుంచి కూడా ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంటుంది. ఇప్పుడు తాజాగా 2020-21 సావరిన్ గోల్డ్ బాండ్ సిరీస్ - iii కి సంబంధించి ఆర్బీఐ ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ ప్రైస్ (ముందస్తు విమోచన ధర) ప్రకటించింది. ఈ గోల్డ్ బాండ్లను 2019 జూన్ 16న ఇష్యూ చేసింది. ఇప్పుడు 2026, జూన్ 16 నుంచి ముందస్తుగా విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఇస్తోంది. ఇష్యూ డేట్, రిడెంప్షన్ డేట్‌కు ముందు 3 వర్కింగ్ డేస్ సగటు గోల్డ్ ధర ఆధారంగా ఇక్కడ పసిడి గ్రాము ధరను నిర్ణయిస్తారు. దీనిని ఐబీజేఏ నిర్ణయిస్తుంటుంది. ఈ గోల్డ్ బాండ్ సిరీస్ విషయానికి వస్తే 2019లో ఇష్యూ చేసినప్పుడు గ్రాము పసిడి ధర రూ. 4,677 కాగా.. ఆన్‌లైన్‌ ద్వారా అప్లై చేసి డిజిటల్ పేమెంట్ చేసిన వారికి గ్రాముపైన రూ. 50 డిస్కౌంట్ వస్తుంది. ఇక్కడ గ్రాము రూ. 4,627 కే వచ్చిందన్నమాట. లక్షకు రూ. 3.36 లక్షలొచ్చాయ్..ఇప్పుడు గోల్డ్ బాండ్ ప్రీ మెచ్యూర్ రిడెంప్షన్ ప్రైస్ గ్రాముకు రూ. 14,774 గా నిర్ణయించింది. ఇది జూన్ 11, 12, 15 తేదీల సగటు ధర. దీంతో ఇక్కడ గ్రాముపైనే రూ. 14774- రూ. 4627= రూ. 10,147 చొప్పున లాభం వచ్చింది. ఇది శాతం పరంగా చూస్తే 219.30 గా ఉంది. అంటే అప్పట్లో ఏడేళ్ల కిందట రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పుడు 219 శాతం రిటర్న్స్ లెక్కన అది కాస్తా రూ. 3,19,300 అయ్యేది. అంటే లక్షకు రూ. 3 లక్షలకుపైనే వచ్చింది. ఇక్కడ మనం వడ్డీ రేటును ప్రాతిపదికలోకి తీసుకోలేదు. ఈ సిరీస్ గోల్డ్ బాండ్లపై వార్షికంగా 2.50 శాతం వడ్డీ ఆఫర్ చేయగా.. ప్రతి లక్షపై ఏడాదికి రూ. 2500 వడ్డీ అందుతుంది. ఈ లెక్కన ఏడేళ్లలో చూస్తే ఇది వడ్డీతోనే రూ. 17,500 అవుతుంది. అంటే లక్ష పెట్టుబడిపై మొత్తంగా చేతికి రూ. 3,36,800 వచ్చిందని చెప్పొచ్చు.