తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో జనసేన నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగా.. వాటికి కాంగ్రెస్ నేతలు కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో బుధవారం రోజున పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటించనున్నారు. అరుదైన వ్యాధితో బాధపడుతూ చావుబతుకుల మధ్య ఉన్న యువకుడిని పరామర్శించేందుకు పవన్ రానున్నారు.ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత ఖరారైంది. తన అభిమాని నిరంజన్‌ను పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ బుధవారం రోజున వరంగల్‌లో పర్యటించనున్నారు. హనుమకొండకు చెందిన నిరంజన్ అనే 16 ఏళ్ల యువకుడు.. ప్రాణాంతకమైన వ్యాధితో పోరాటం చేస్తున్నాడు. అయితే తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్‌ను చూడాలనే నిరంజన్ చివరి కోరిక కాగా.. అతడి కోరిక తీర్చేందుకు పవన్ కళ్యాణ్ వారి ఇంటికి వెళ్లనున్నారు. ఆ తర్వాత వరంగల్ భద్రకాళి అమ్మవారిని జనసేనాని దర్శించుకోనున్నారు.నిరంజన్‌ బాల్యంలో బాగానే ఉన్నప్పటికీ.. 8 ఏళ్ల క్రితం అతడి జీవితం ఒక్కసారిగా మారిపోయింది. జన్యుపరమైన డీఎండీ వ్యాధి బారిన పడిన నిరంజన్.. అప్పటి నుంచి పూర్తిగా మంచానికే పరిమితం అయ్యాడు. అతడి ఎదుగుదల పూర్తిగా లోపించగా.. గట్టిగా పట్టుకుంటే భరించలేని నొప్పితో బాధపడుతున్నాడు. ఇటీవల టీవీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆడిన ఫుట్‌బాల్‌ మ్యాచ్‌‌ను చూసిన నిరంజన్‌.. సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ను చూడాలని, వారిని కలవాలని ఉందని కోరాడు. ఈ క్రమంలోనే నిరంజన్ కోరికను జనసేన నేతలు, అభిమానులు పవన్ కళ్యాణ్‌కు వివరించారు. దీంతో ఆ విజ్ఞప్తిని మన్నించిన పవన్ కళ్యాణ్ బుధవారం హనుమకొండ వెళ్లి నిరంజన్‌ను పరామర్శించనున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో వరంగల్‌లో జనసేన కార్యకర్తలు, నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు కూడా అప్రమత్తమై.. ఈ పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే గత కొన్నిరోజులుగా తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి.. పవన్ కళ్యాణ్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం నడుస్తోంది. జనసేన సభకు పోలీసులు, హైకోర్టు అనుమతి ఇవ్వకపోవడంతో.. ఆ పార్టీ చీఫ్, నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కావాలనే జనసేనను అడ్డుకుంటున్నారని.. తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఎవరి అబ్బ జాగీరు కాదు అంటూ పవన్ కళ్యాణ్ ప్రెస్‌మీట్ పెట్టి మరీ తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఈ వివాదాన్ని మరింత పెంచింది. తాజాగా ఢిల్లీలో సేన ప్రస్థానం పేరుతో సోమవారం నిర్వహించిన సమావేశంలోనూ తెలంగాణ సర్కార్‌పై పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అమరవీరులు అంటే తనకు ఎంతో గౌరవం ఉందని.. అయితే వారిని గుర్తించేందుకు తెలంగాణ పాలకులకు 12 ఏళ్లు సరిపోలేదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.