మానవ ఆరోగ్యానికి, పర్యావరణానికి తీవ్ర ముప్పు తెచ్చిపెడుతుందనే ఉద్దేశ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్యాట్‌ఫిష్ (ఆఫ్రికన్ మాగుర్) పెంపకంపై దేశవ్యాప్తంగా కఠినమైన నిషేధం విధించాయి. అయితే.. చట్టాల పట్ల ఏమాత్రం భయం లేకుండా, అధికారుల కళ్లు గప్పి వనపర్తి జిల్లాలో అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాన్ని ఆసరాగా చేసుకుని.. కేవలం ఒక్క పెబ్బేరు మండలంలోనే 30కి పైగా క్యాట్‌ఫిష్ పెంపకం చెరువులను ఏర్పాటు చేశారు. దీంతో పాటు నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లోనూ ఈ రకమైన నిషేధిత చేపల చెరువులు జోరుగా సాగుతున్నాయి. గతంలో మత్స్యశాఖ అధికారులు నామమాత్రంగా కొన్ని చెరువులను ధ్వంసం చేసి చేతులు దులుపుకోవడంతో నిర్వాహకులు మళ్లీ వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు.వనపర్తి, కొత్తకోట, ఆత్మకూరు, పెబ్బేరు మున్సిపాలిటీల పరిధిలోని చికెన్ సెంటర్ల నుంచి సేకరించే వ్యర్థాలను ఈ క్యాట్‌ఫిష్‌లకు ప్రధాన ఆహారంగా వాడుతున్నారు. వనపర్తి జిల్లా కేంద్రం నుంచే ప్రతిరోజూ దాదాపు 15 మెట్రిక్ టన్నుల చికెన్ వ్యర్థాలను సేకరించేందుకు టెండర్లు దక్కించుకున్న వ్యాపారులు, ఆ చెత్తను మున్సిపల్ యార్డులకు తరలించకుండా ఈ అక్రమ పెంపకందారులకు అమ్మేస్తున్నారు. సాధారణ దాణా కంటే ఈ కుళ్లిన మాంసాన్ని తినడం వల్ల క్యాట్‌ఫిష్‌లు చాలా తక్కువ కాలంలోనే ఊహించని విధంగా బరువు పెరుగుతాయి. ఇతర రకాల చేపలేవీ ఈ మాంస వ్యర్థాలను ముట్టవు. అయితే.. టన్నుల కొద్దీ చికెన్ వ్యర్థాలను చెరువుల వద్ద కుప్పలుగా వేస్తుండటంతో చుట్టుపక్కల ప్రాంతాలు నరకప్రాయంగా మారుతున్నాయి. తీవ్రమైన దుర్వాసనతో ఊపిరి పీల్చుకోలేకపోతున్నామని, పంట పొలాల్లో పనులు చేసుకోలేకపోతున్నామని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ అక్రమ దందాను నడిపిస్తోంది పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు బడా ఆక్వా వ్యాపారులని సమాచారం. వనపర్తిలోనే పదుల సంఖ్యలో చెరువులను లీజుకు తీసుకుని స్థానిక యంత్రాంగాన్ని మేనేజ్ చేస్తూ వీరు కోట్లాది రూపాయలు గడిస్తున్నారు. సాధారణ చేపలు మార్కెట్లో కిలో రూ. 150 వరకు పలుకుతుండగా.. ఈ క్యాట్‌ఫిష్‌లను హోల్‌సేల్‌గానే కిలో రూ. 100 పైచిలుకు ధరకు అమ్ముతున్నారు. ఇక్కడ పెంచిన చేపలను విజయవాడ, విశాఖపట్నం, రాయలసీమ జిల్లాలతో పాటు బెంగళూరు మహానగరానికి భారీ కంటైనర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. క్యాట్‌ఫిష్‌లను తినడం వల్ల మానవులలో క్యాన్సర్, కాలేయ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి టాస్క్‌ఫోర్స్ రంగాన్ని రంగంలోకి దింపి ఈ చెరువులను శాశ్వతంగా మూసివేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.