ట్రంప్‌లో సైకోపాథిక్ లక్షణాలు.. ఇరాన్ సంచలన కామెంట్స్! చర్చల వేళ రంగంలోకి సైకాలజిస్టులు?

Wait 5 sec.

శాంతి ఒప్పంద సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన పరోక్ష చర్చల్లో సైకాలజిస్టులను తీసుకొచ్చిందనే వార్తలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. డ్రాప్ సైట్ ప్రచురించిన కథనం ప్రకారం.. అమెరికా - ఇరాన్ మధ్య ఉద్రికత్తలను తగ్గించే లక్ష్యంతో ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. ఆ సమయంలో ట్రంప్ ప్రవర్తనను విశ్లేషించేందుకు ఇరాన్ ఇద్దరు సీనియర్ సైకాలజిస్టులను సంప్రదింపుల బృందానికి సలహాదారులుగా చేర్చుకుంది. ఏప్రిల్‌లో ఇస్లామాబాద్ వేదికగా అమెరికా - ఇరాన్ మధ్య తొలి దఫా చర్చలు జరిగాయి. ఆ సమయంలో ట్రంప్ వ్యవహరించిన తీరుతోనే రెండో దఫా చర్చలకు సైకాలజిస్టులను ఇరాన్ తీసుకురావాల్సి వచ్చింది. "ట్రంప్‌లో మేము సైకోపాథిక్ ప్రవర్తన లక్షణాలు ఉన్నాయని భావిస్తున్నాం. ఆ కోణంలోనే ఇద్దరు సీనియర్ సైకాలజిస్టులను సంప్రదింపుల బృందంలో చేర్చాం" అని పేర్కొన్నట్లు డ్రాప్ సైట్ నివేదిక పేర్కొంది. ఈ సైకాలజిస్టుల ప్రధాన పని ట్రంప్ ప్రవర్తనను విశ్లేషించడమే. ట్రంప్ ప్రవర్తనను విశ్లేషించి, ప్రాంతీయ మధ్యవర్తుల ద్వారా ఆయనకు చేరే సందేశాలను ఎలా రూపొందించాలి అనే దానిపై సూచనలు ఇవ్వడమే. సైకాలజిస్టుల సూచనలను లిఖితపూర్వకంగా సందేశాల్లో చేర్చిన తర్వాత ట్రంప్ స్పందనలో మార్పు కనిపించిందని ఆ అధికారి పేర్కొన్నట్లు నివేదిక వెల్లడించింది. "మా సలహాదారుల సూచనలను సందేశాల్లో అమలు చేయడం ప్రారంభించిన తర్వాత ట్రంప్ ప్రతిస్పందనలు మరింత సానుకూలంగా మారాయి" అని ఓ అధికారి పేర్కొన్నట్లు తమ కథనంలో రాసుకొచ్చారు. ఇదే సమయంలో ట్రంప్ ఆరోగ్యంపై అమెరికాలో కూడా చర్చ జరుగుతోంది. వాషింగ్టన్ పోస్ట్ కథనం మేరకు.. ట్రంప్ తాజా వైద్య పరీక్షల్లో 22 మంది వైద్య నిపుణులు పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడి ఒకే వైద్య పరీక్షల్లో ఇంత పెద్ద సంఖ్యలో నిపుణులు పాల్గొనడం ఇదే తొలిసారి అని ఆ కథనం పేర్కొంది. ఇక అమెరికా - ఇరాన్ మధ్య యుద్ధ భేరీ దాదాపు ముగిసినట్టే అని చెప్పొచ్చు. ట్రంప్ కూడా యుద్ధం ఆగిపోయిందని ప్రకటించారు. శాంతి ఒప్పందాలపై ఇరు దేశాలు జూన్ 19న స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో అధికారికంగా సంతకాలు చేయనున్నట్లు సమాచారం.