పవన్ కళ్యాణ్ ముసుగులో బీజేపీ ప్లాన్.. ఆ ఆర్వోను ఉరేసినా తప్పలేదు: టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

Wait 5 sec.

పవన్‍ కళ్యాణ్‍ను బూచిగా చూపి తెలంగాణలో పాగా వేయాలని చూస్తోందని, కానీ ఆ పార్టీకి రాష్ట్రంలో స్థానం లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణలో మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో జనసేన కార్యాలయాన్ని ప్రారంభించిన నేపథ్యంలో ఈ విధంగా స్పందించారు. శనివారం ఆయన గాంధీ భవన్‍లో మీడియాతో మాట్లాడుతూ.. శాశ్వతంగా అధికారంలోకి ఉండటం కోసం ఎంతకైనా తెగిస్తున్నారని, బీజేపీ చెప్పిందే రాజ్యాంగం అన్నట్టు వ్యవహరిస్తున్నారని మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. ప్రాంతీయ పార్టీలను చీల్చి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. విశ్వవిద్యాలయాల్లోకి దూరిన బీజేపీ రఘుపతి రాఘవ రాజారాం పేరు స్థానంలో గాడ్సే జపం చేస్తోందని టీపీసీసీ చీఫ్ ధ్వజమెత్తారు. గాడ్సే రాజ్యం స్థాపన వ్యూహంతో సొంత ఎజెండాను తీసుకొచ్చిన కమలం పార్టీ.. జనాలపై రుద్దుతుందని ఆయన దుయ్యబట్టారు. అధికారంలోకి వస్తే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఊదరగొట్టిన బీజేపీ.. ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతోందని, 90 శాతం సంపద బీజేపీ నాయకుల అనుచరుల చేతిలో ఉందని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తులు వర్సిటీల్లోకి దూరి వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. సరిహద్దుల్లో భారత భూభాగంలోకి చైనా చొచ్చుకొస్తుంటే ఆ విషయం గురించి బీజేపీ నోరెత్తడం లేదని, లోక్‌సభలో తమ నాయకుడు రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ఫోటోలతో సహా చూపించారని పేర్కొన్నారు. అంతేకాదు, గాంధీ కుటుంబం త్యాగానికి మారుపేరని, గాంధీ, నెహ్రూల గురించి బీజేపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం కోసం ఇందిర గాంధీ, రాజీవ్ గాంధీ తమ ప్రాణాలు అర్పించారని పీసీసీ చీఫ్ గుర్తు చేశారు.అలాగే, మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అంశం గురించి ఆయన ప్రస్తావించారు. ఈ విషయంలో దుర్మార్గంగా వ్యవహరించారని, అసలు కేసు లేకుండా నామినేషన్ తిరస్కరించిన రిటర్నింగ్ ఆఫీసర్‍ను ఉరి తీసినా తప్పులేదని పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ఝార్ఖండ్‍లో మాత్రం అంబానీలకు చెందిన వ్యక్తికి సరైన పత్రాలు లేకపోయినా మరోసారి అవకాశం ఇచ్చారని ఆయన ఆరోపించారు. దేవుడు పేరు చెప్పకుండా గెలిచే దమ్ము బీజేపీ నేతలకు ఉందా? అని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఉదయం లేస్తే దేవుడి పేరు జపం చేస్తారన్నారు. లౌకిక వాదం ఉన్న వారి ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.