మరికొన్ని గంటల్లో వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. మరికొన్ని గంటలలో ఏపీలోని పలు ప్రాంతాలలో పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వచ్చే మూడు గంటల్లో పార్వతీపురం మన్యం జిల్లాలో అక్కడక్కడా పిడుగులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ,చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ అంచనా వేశారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు విదర్భ,ఛత్తీస్‌గఢ్ మీదుగా ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఆదివారం రోజున రాయలసీమ జిల్లాలలో చెదురుమదురుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే బాపట్ల, నెల్లూరు జిల్లాలలో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగిలిన జిల్లాలలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలకు ఆస్కారం ఉందని అంచనా వేసింది. బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మరోవైపు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. అయినప్పటికీ వాతావరణం మాత్రం ఇంకా చల్లబడటం లేదు. పగటి పూట ఉష్ణోగ్రతలు, ఉక్కబోతతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నుంచి వాతావరణంలో మార్పులు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాలలో వర్షం పడే అవకాశాలు ఉన్నాయని.. తెలంగాణలోనూ పలు జిల్లాలలో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సెంట్రల్, దక్షిణ తెలంగాణ జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. వర్షాకాలం నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అథికారులు సూచనలు చేస్తున్నారు.