రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని, ఈ విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు ఆర్థిక, విద్యావేత్తలు, వివిధ రంగాల నిపుణులతో కూడిన ఉన్నతస్థాయి సంప్రదింపుల బృందాన్ని ఏర్పాటు చేయాలని తమిళనాడు ప్రభుత్వానికి మాజీ ఐపీఎస్, '' వ్యవస్థాపకుడు కె. అన్నామలై సూచించారు. తమిళనాడు ఆర్థిక పరిస్థితిపై ఇటీవల శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. మొత్తం అప్పులు రూ.10 లక్షల కోట్లు దాటాయని పేర్కొన్న నేపథ్యంలో అన్నామలై నుంచి ఈ సూచన వచ్చింది. విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం జూన్ 16న శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ఆ రాష్ట్ర ప్రత్యక్ష రుణాలు దాదాపు రూ.10 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల బకాయిలను కూడా పరిగణనలోకి తీసుకుంటే అది రూ.13.18 లక్షల కోట్లుగా ఉంది. వచ్చే మొత్తం ఆదాయంలో 22.8 శాతం కేవలం వడ్డీలకే సరిపోతుందని ఈ నివేదిక వెల్లడించింది. అయితే, గత ఐదేళ్లలో జరిగిన ఆర్థిక దుర్వినియోగానికి ఈ నివేదిక ఓ 'పోస్ట్‌మార్టమ్' లాంటిదని అన్నామలై అభిప్రాయపడ్డారు.‘‘రూ.10 లక్షల కోట్ల రుణం జనాభా నిష్పత్తి ప్రకారం ఒక్కొక్కరిపై రూ.1,28,934 అప్పుగా ఉంది.. మొత్తం ఆదాయంలో 22.8% వడ్డీ చెల్లింపులు.. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (GSDP)కి రాష్ట్ర సొంత పన్ను రాబడి (SoTR) నిష్పత్తి 2021-22లో 5.93% నుంచి 2025-26 నాటికి 5.45%కి పడిపోయింది.. -విద్యుత్, రవాణా, పౌర సరఫరాల విభాగం, ప్రధాన రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు (PSUలు) కలిపి రూ.3.18 లక్షల కోట్ల రుణాలు ఉన్నాయి.వ్యవస్థాగత అవినీతి, రియల్ ఎస్టేట్ ధరలను తక్కువగా చూపించడం ద్వారా రిజిస్ట్రేషన్ రాబడులను అణచివేయడం,మరెన్నో కారణాల వల్ల రాబడి తగ్గింది’’ అని అన్నామలై తెలిపారు.ఈ నివేదికను సాకుగా చూపి నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, తక్షణ దిద్దుబాటు చర్యలకు దీనిని ఒక మార్గసూచిగా పరిగణించాలని మాజీ ఐపీఎస్ హితవు పలికారు. ఇదే సమయంలో రాష్ట్రంలో 2031 నాటికి పనిచేసే వయసున్న జనాభా క్రమంగా తగ్గనుందని, ఇది అత్యంత ఆందోళనకరమైన అంశమని ఆయన హెచ్చరించారు. ఆదాయ వనరులను పెంచుకుని, అప్పుల భారాన్ని తగ్గించుకోవడానికి ప్రభుత్వానికి చాలా తక్కువ సమయం ఉందని ఆయన స్పష్టం చేశారు.ఇదిలా ఉండగా, శనివారం కాంచీపురం జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న వీడియో అన్నామలై స్పందించారు. కాంచీపురం జిల్లాలోని ఉత్తిరమేరూరు సమీపంలో ఒక ప్రభుత్వ పాఠశాల తరగతి గదిలో సోషల్ మీడియా రీల్స్ చిత్రీకరిస్తున్న వీడియో బయటపడటంతో తమిళగ వెట్రి కజగం కార్యకర్తలు వివాదంలో చిక్కుకున్నారు. సీఎం విజయ్ ఫోటోను తగిలించడానికి అధికార పార్టీకి చెందిన 20 మందికి పైగా కార్యకర్తలు పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ వివాదం చెలరేగింది. అధికార టీవీకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన అన్నామలై.. రైతులకు పంట రుణమాఫీపై ఇచ్చిన ఎన్నికల హామీని పూర్తిగా నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.‘‘అధికార పార్టీ అయినంత మాత్రాన ప్రభుత్వ పాఠశాలల్లోకి ప్రవేశించి తరగతులకు ఆటంకం కలిగించే హక్కు ఎవరికీ ఉండదు. ముఖ్యమంత్రి స్వయంగా ఇలాంటి చర్యలను ఆమోదించరని నేను నమ్ముతున్నాను’’ అని అన్నామలై అన్నారు. భవిష్యత్తులో టీవీకే కార్యకర్తలు ఇలాంటి కార్యకలాపాలకు దూరంగా ఉండేలా చూడాలని సీఎం విజయ్, పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్‌మోహన్‌లను ఆయన కోరారు.