రైలు జర్నీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని కొన్నిసార్లు నిల్చోడానికి కూడా ఖాళీ ఉండదు. రిజర్వేషన్ బెర్తుల్లోనూ ప్యాసింజర్లు కిక్కిరిసిపోతారు. ఎన్నిసార్లు ఎన్ని వీడియోలు వచ్చిన నో ఛేంజ్. కానీ, ఈ సారి ఓ ప్రయాణికుడు పెట్టిన వీడియోకు రైల్వేశాఖ స్పందించడమే కాకుండా చర్యలు కూడా తీసుకుంటామంటూ రిప్లయ్ ఇచ్చింది. బిహార్‌కు వెళ్తున్న ఓ రైలు రిజర్వేషన్ కోచ్‌లో కొంతమంది టికెట్ లేని ప్రయాణికులు టాయిలెట్‌ను కూడా ఆక్రమించారు. ఓ ప్యాసింజర్ టాయిలెట్‌కి వెళ్లే ప్రయత్నం చేసినా ఆ టాయిలెట్ రూమ్ బయట, లోపల మొత్తం జనాలే. కనీససం వెళ్లే గ్యాప్ కూడా లేకుండా ప్రయాణికులు ఉన్నారు. టాయిలెట్‌కి వెళ్లేందుకు కొంచెం గ్యాప్ ఇవ్వాలని అడిగినప్పటికీ ఆ ప్రయాణికులు పక్కక జరిగేందుకు ససేమిరా అన్నారు. ఈ తతంగం మొత్తాన్ని ప్యాసింజర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కనీసం టాయిలెట్‌కు కూడా వెళ్లే వీలు లేకపోతే ఎలా అంటూ ఆ ప్యాసింజర్ అసహనం వ్యక్తం చేశారు. "రిజర్వేషన్ కోచ్ టాయిలెట్‌లో టికెట్ లేని ప్రయాణికులు కూర్చున్నారు. టాయిలెట్‌ను ఉపయోగించలేకపోతున్నాం. ఖాళీ చేయమంటే బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. కోచ్‌లో ప్రయాణం కూడా చాలా కష్టంగా మారింది. వెంటనే ఆర్ఫీఎఫ్ లేదా టీటీఈని పంపించి చర్యలు తీసుకోవాలి" అంటూ ప్రయాణికులు రైల్వే శాఖను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అయింది. రిజర్వేషన్ చేయించుకున్నా ఇలా ఇబ్బంది పడాలా? అంటూ నెటిజన్లు కూడా రియాక్ట్ అయ్యారు. టాయిలెట్లలో ఇలా చాలాసార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియో వైరల్ కావడంతో వెంటనే రైల్వే శాఖ స్పందించింది. రైల్వే సేవ అధికారిక ఖాతా ద్వారా ప్రయాణికుడిని రైలు నెంబర్, పీఎన్ఆర్, మొబైల్ నెంబర్ వంటి వివరాలు ఇవ్వాలని కోరింది. అదేవిధంగా ఆ వీడియోను సంబంధిత రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులకు కూడా పంపినట్లు తెలిపింది. అవసరమైతే రిజర్వేషన్ కోచ్‌ను ఖాళీ చేయించి, టికెట్ లేని ప్రయాణికులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.