హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ ఫ్యాక్టరీ.. రూ.50 లక్షల మెఫిడ్రిన్ స్వాధీనం, ఫ్యాక్టరీ సీజ్

Wait 5 sec.

రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేసిన ఈగల్ టీం.. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపుతోంది. ఎక్కడికక్కడ దాడులు చేసి.. డ్రగ్స్ ముఠాల ఆట కట్టిస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో మత్తు పదార్థాల తయారీ, రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈగల్ టీం అధికారులు.. నగర శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో దాడులు చేసి.. అక్కడ అత్యంత ప్రమాదకరమైన ఎండీఎంఏ డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసింది.అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి డ్రగ్స్ తయారు చేస్తున్న నరేష్, మత్స్యగిరిలను సోమవారం రోజున ఈగల్ టీం అరెస్ట్ చేసింది. ఈ ముఠాలో సంతోష్ సింగ్ అలియాస్ రాజు అలియాస్ రాజేష్.. విజయ్, అశ్విని పాఠక్ కీలక సభ్యులుగా ఉన్నట్లు ఈగల్ టీం అధికారులు తెలిపారు. అలాగే రూ.50 లక్షల విలువైన మెఫెడ్రోన్‌తోపాటు మరికొన్ని రసాయనాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. రూ.50 లక్షల విలువైన ఆ ఫ్యాక్టరీని ఈగల్ టీం సీజ్ చేసింది.గత కొన్ని ఏళ్లుగా నరేష్, కీసర మత్స్యగిరిలు తప్పించుకుని తిరుగుతున్నారని ఈగల్ టీం వెల్లడించింది. రసాయన శాస్త్రవేత్త నుంచి అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా సభ్యులుగా ఎదిగినట్లు అధికారులు తెలిపారు. గతంలో హత్యలు, దోపిడీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత చివరికి వీరు డ్రగ్స్ తయారీదారులుగా మారినట్లు వివరించారు. అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్‌లో వీరి ముఠా చాలా కీలకంగా వ్యవహరించినట్లు వెల్లడించారు. గత 6 నెలలుగా ఈ ముఠా కోసం గాలింపు చర్యలు చేస్తున్నట్లు ఈగల్ టీమ్ అధికారులు చెప్పారు. 2015 నుంచి దేశవ్యాప్తంగా ఈ ముఠా అక్రమంగా ఇలా డ్రగ్స్ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసి.. తన కార్యకలాపాలు సాగిస్తోందని ఈగల్ టీం వివరించారు. వీరిని విచారించి.. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా ఆట కట్టించేందుకు ఈగల్ టీం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. గత కొంతకాలంగా ఈగల్ టీం భారీగా దాడులు చేసి.. డ్రగ్స్ ముఠాలను పట్టుకుంటున్నాయి.