నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి. జూన్ ఆరో తేదీన రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. సోమవారం నాటికి (జూన్ 15) ఆంధ్రప్రదేశ్‌ అంతటా విస్తరించినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాష్ట్రంలోని పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని అంచనా వేశారు. కోస్తాంధ్ర జిల్లాలోని మిగతా జిల్లాలతో పాటుగా చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వర్షాలతో పాటుగా కొన్ని జిల్లాలలో ఎండలు ప్రభావం చూపించే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం చేసింది. మరోవైపు సోమవారం రాత్రి శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ హెచ్చరించింది. ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. అల్లూరి జిల్లాలో వర్ష బీభత్సం.. మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. హుకుంపేట మండలంలోని జరకొండ పంచాయతీ పరిధిలో పిడుగు పాటుకు గురై 35 మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయి. ఇందులో మేకలు, గొర్రెలతో పాటుగా ఆవులు ఉన్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరారు.