ప్రకాష్‌రాజ్‌కు షాక్.. తిరుపతి కోర్టులో ప్రైవేట్ కేసు..

Wait 5 sec.

సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌కు షాక్ తగిలింది. తిరుపతిలో ఆయనపై ప్రైవేట్ కేసు దాఖలైంది. టీటీడీ బోర్డు మెంబర్, బీజేపీ నేత జి. భానుప్రకాష్ రెడ్డి తరుఫున ఆయన న్యాయవాది అజయ్ కుమార్ నాలుగో అదనపు మున్సిఫ్‌ కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేశారు. రామాయణం, శ్రీరాముడిని ఉద్దేశించి ప్రకాష్‌రాజ్ చేసిన వ్యాఖ్యలు గతంలో వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై గతంలోనే న్యాయవాది ద్వారాచేశారు భానుప్రకాష్ రెడ్డి. తాజాగా ప్రైవేట్ కేసు దాఖలు చేశారు. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న భానుప్రకాష్ రెడ్డి.. ఆ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని పేర్కొన్నారు. బీఎన్ఎస్ సెక్షన్‌ 196, సెక్షన్‌ 299 కింద కేసును విచారించాలని కోర్టును కోరారు. మరోవైపు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కేరళలో జరిగిన లిటరేచర్ ఫెస్టివల్‌లో మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రామాయణం, శ్రీరాముడు, లక్ష్మణుడిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ అప్పట్లోనే భానుప్రకాష్ రెడ్డి.. ప్రకాష్ రాజ్‌కు లీగల్ నోటీసులు పంపించారు. తన వ్యాఖ్యలతో కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు ప్రకాష్ రాజ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రకాష్ రాజ్ మీద రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. అయితే ఈ నోటీసులపై స్పందన లేకపోవటంతోనే భానుప్రకాష్ రెడ్డి ప్రైవేట్ కేసు దాఖలు చేశారు. కోట్లాది మంది హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచే దేవుణ్ని కించపరచడం ద్వారా ప్రకాష్ రాజ్ ఉద్దేశపూర్వకంగా మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. బహిరంగ క్షమాపణ చెప్పాలన్న తమ నోటీసుల పట్ల ప్రకాష్ రాజ్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. అందుకే తిరుపతి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేసినట్లు తెలిపారు.