చర్లపల్లి జైలులో ఐటీఐ కాలేజీ.. ఖైదీలకు ట్రైనింగ్.. బయటికి వచ్చిన తర్వాత ఉపాధి అవకాశాలు

Wait 5 sec.

ఏదైనా నేరం చేసిన వారికి శిక్ష విధించడం అంటే వారు చేసిన తప్పు తెలుసుకుని.. దాని నుంచి పశ్చాత్తాపానికి గురై.. తిరిగి మంచి వ్యక్తులుగా మారాలనే ఉద్దేశం ఉంటుంది. అయితే అందులో చాలా మంది జైలుకు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ తప్పులు చేసి.. తిరిగి జైళ్లకే వెళ్తున్న వారు ఉన్నారు. మరికొందరు పోలీసులకు దొరకకుండా నేరాలు చేస్తూ తప్పించుకుంటున్నారు. ఏదైనా కేసులో శిక్ష పడి.. జైలుకు వెళ్లి వచ్చిన వారికి సమాజంలో గౌరవం ఉండటం లేదు. ఈ నేపథ్యంలోనే జైలుకు వెళ్లి వచ్చిన వారికి ఉద్యోగాలు, పని కూడా చాలా వరకు కల్పించడం లేదు. దీంతో తిరిగి వాళ్లు నేరాల బాట పడుతున్నారు. ఈ క్రమంలోనే కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా జైలు శిక్ష అనుభవిస్తున్న వారికి చదువుకునే అవకాశం ఉంటుంది. జైలులో ఉంటూనే చదువుకుని డిగ్రీలు సంపాదించిన వారు చాలా మంది ఉంటారు. ఈ నేపథ్యంలోనే వారికి చదువుతోపాటు వృత్తిపరమైన ట్రైనింగ్ కూడా ఇవ్వాలని తెలంగాణ జైళ్ల శాఖ నిర్ణయించిందు. ఇందులో భాగంగానే చర్లపల్లి సెంట్రల్ జైలులో ప్రభుత్వ ఐటీఐ కాలేజీని ఏర్పాటు చేయాలని జైళ్ల శాఖ నిర్ణయించింది. ఈ క్రమంలోనే తెలంగాణ జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా.. సోమవారం చర్లపల్లి జైలులో ఐటీఐ కాలేజీ ఏర్పాట్లకు సంబంధించిన పనులను పర్యవేక్షించారు. కేంద్ర నైపుణ్య శిక్షణా సంస్థ(ఎన్‌ఎస్‌టీఐ), కేంద్ర నైపుణ్య శిక్షణా సంస్థ-మహిళలు(ఎన్‌ఎస్‌టీఐ-డబ్ల్యూ) సంస్థల ప్రతినిధులతో కలిసి జైళ్ల శాఖ డీజీ.. చర్లపల్లి జైలులో స్థల పరిశీలన నిర్వహించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ రీజినల్‌ డైరెక్టర్‌ చిలుకోటి రవి.. ఎన్‌ఎస్‌టీఐ-డబ్ల్యూ జాయింట్‌ డైరెక్టర్‌ ప్రియతో కలిసి.. జైలులో ఐటీఐ కాలేజీని ఏర్పాటు చేయడంతోపాటు.. సిలబస్ అమలు, సర్టిఫికేషన్‌ వంటి వాటిపై సుదీర్ఘంగా చర్చించారు. జైలుకు వచ్చిన ఖైదీలు శిక్ష పూర్తి చేసుకుని.. తిరిగి బయటికి వెళ్లేటపుడు.. ఏదైనా పని నేర్చుకుని.. వారు సమాజంలో గౌరవప్రదంగా జీవించేలా.. బయటికి వెళ్లిన తర్వాత వారికి ఉపాధి మార్గాలను చూపించే దిశగా జైళ్ల శాఖ ఈ నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. నేరాలు చేసి జైలుకు వచ్చిన ఖైదీలకు కేవలం శిక్ష మాత్రమే విధించకుండా.. వారిలో మార్పును తీసుకువచ్చి.. సమాజంలో మంచి పౌరులుగా మారి, పని చేసి ఉపాధిని పొందేలా చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా వెల్లడించారు.