బద్రీనాథ్ ఆలయంలో ముకేశ్ అంభానీ ప్రత్యేక పూజలు.. రూ.10 కోట్ల భూరి విరాళం

Wait 5 sec.

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ తన కుటుంబంతో కలిసి హిమాలయాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు కేదార్‌నాథ్, బద్రీనాథ్‌ ఆలయాలను సోమవారం దర్శించుకున్నారు. ప్రత్యేక హెలికాఫ్టర్‌లో సోమవారం ఉదయం 9.15 గంటలకు కుటుంబసభ్యులు, సన్నిహితులతో కలిసి తొలుత బద్రీనాథ్‌ ఆలయానికి చేరుకున్నారు. అక్కడ వారికి బద్రీనాథ్‌-కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ (బీకేటీసీ), వేద పండితులు స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం బదరీ నారాయణుడికి రూ.10 కోట్లను విరాళంగా ప్రకటించారు. తర్వాత ఉదయం 10. 40 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 11.15 గంటలకు కేదార్‌నాథ్ చేరుకున్నవారికి అధికారుల నుంచి ఘనస్వాగతం లభించింది. కేదారీశ్వరుడికి జలాభిషేకం చేసి, ప్రత్యేక పూజలు అనంతరం 12 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి ఢిల్లీకి వెళ్లారు.కాగా, ఆలయాభివృద్ధికి, చార్‌ధామ్ యాత్రికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు రూ.10 కోట్లను ముకేశ్ అంబానీ విరాళం ఇచ్చారని బీకేటీసీ సీఈఓ సోహన్‌ సింగ్‌ రానా తెలిపారు. చార్‌ధామ్‌ యాత్రలోని భాగమైన బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌ ఆలయాలను ముకేశ్‌ అంబానీ ఏటా సందర్శిస్తుంటారు. ఇక, ఈ ఏడాది ఛార్‌దామ్‌ యాత్ర మొదలైనప్పటి నుంచి జూన్‌ 13 వరకు 12.23 లక్షలపైగా భక్తులు కేదార్‌నాథ్‌ను సందర్శించగా, 10.92 లక్షల మంది బద్రీనాథ్‌ ఆలయాన్ని దర్శించుకున్నారు. అలాగే, గంగోత్రిని 5.95 లక్షలు, యమునోత్రిని 5.56 లక్షలు మంది దర్శించుకున్నట్టు అధికారులు తెలిపారు.ఇదిలా ఉండగా, జూన్ 12న ముకేశ్ అంబానీ తన చిన్న కుమారుడు అనంత్, కోడలు రాధిక మర్చంట్‌లు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారిని ముగ్గురూ కలిసి వీఐపీ బ్రేక్ సమయంలో దర్శనం చేసుకున్నారు. అక్కడ నుంచి చిత్తూరులోని ప్రముఖ శివాలయం గుడి మల్లాన్ని కూడా దర్శించుకుని, ఆలయ అభివృద్ధికి నిధులు, సహకారం అందిస్తామని అనంత్ అంబానీ హామీ ఇచ్చారు. అలాగే, గత నెలలో బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సెంటర్‌ 45వ వార్షికోత్సవంలోనూ ముకేశ్ పాల్గొని, గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ నుంచి ఆశీర్వచనాలు పొందారు.