పంబాజ్ సీఎం భగవంత్ మాన్‌కు భారీ షాక్.. ‘గురు ద్రోహి’గా ప్రకటించిన అకాల్ తఖ్త్

Wait 5 sec.

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు సిక్కుల అత్యున్నత ఆధ్యాత్మిక సంస్థ భారీ షాకిచ్చింది. ఆయనను ‘గురు ద్రోహి’గా ప్రకటిస్తూ.. సిక్కు సమాజం మాన్‌తో ఎటువంటి సంబంధం పెట్టుకోవద్దని పిలుపునిచ్చింది. అకాల్ తఖ్త్ అనేది సిక్కుల అత్యున్నత మత సంస్థ. సిక్కు భక్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై నోటీసులు జారీచేయడంతో గత జనవరి 15న పంజాబ్ ముఖ్యమంత్రి అకాల్ తఖ్త్ ఎదుట హాజరయ్యారు. ఈ సమయంలో సిక్కు గురువులపై మద్యం చల్లుతున్నట్టు ఓ వీడియోపై కూడా మత పెద్దలు ప్రశ్నించారు. అయితే, అది ఏఐ వీడియో అని తోసిపుచ్చారు. కానీ, సోమవారం వచ్చిన ఫోరెన్సిక్ నివేదికలో అది అసలైన వీడియో అని వెల్లడయ్యింది. ఆ వీడియోలోని వ్యక్తి నిజంగా ముఖ్యమంత్రే అని ఫోరెన్సిక్ నివేదిక చెప్పలేదని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎదురు వాదన చేసింది. కానీ, ఐదుగురు సింగ్ సాహిబ్‌ల (ప్రధాన మతగురువుల) సమావేశం అనంతరం.. అకల్ తఖ్త్ జాతేదార్ కుల్దీప్ సింగ్ గర్గాజ్ తీర్పును ప్రకటించారు. ‘‘మేము ఆ వీడియో గురించి ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే అది ఏఐతో రూపొందించిందని ఆయన సమాధానం ఇచ్చారు.. దీనికి రుజువు చూపమని ఆయన్ని కోరాం.. కానీ ఆరు నెలల పాటు ఎటువంటి స్పందన రాలేదు. ఆ తర్వాత, భారత ప్రభుత్వం గుర్తించిన రెండు ఫోరెన్సిక్ ల్యాబ్‌ల్లో ఆ వీడియోను పరీక్షించగా నకిలీది కాదని, ఏఐతో రూపొందించింది కూడా కాదని తేలింది. ఈరోజు, 'పంథ్' ఈ విషయంపై చర్య తీసుకుని ఒక నిర్ణయానికి వచ్చింది’’ అని గర్గాజ్ అన్నారు.అకాల్ తఖ్త్ వద్ద మాన్ అబద్ధం చెప్పారని అందుకే ఆయనను గురువు దృష్టిలో దోషిగా లేదా 'గురు ద్రోహి'గా ప్రకటించారని జాతేదార్ అన్నారు. ‘‘సిక్కులకు ముఖ్యమంత్రిపై ఎలాంటి అంచనాలు లేవు, 'పంథ్', గురువు అనుచరులు ఆయనతో ఎటువంటి సంబంధం పెట్టుకోకూడదు’’ అని ఆయన తెలిపారు.వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికల జరగనున్న నేపథ్యంలో అకాల్ తఖ్త్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ‘జాగత్ జోత్ శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ సత్కార్ (సవరణ) బిల్లు, 2026’ ఆమోదం విషయంలో పంజాబ్ క్యాబినెట్‌ మొత్తాన్ని జూన్ 29న తమ ముందు హాజరు కావాలని అకల్ తఖ్త్ ఆదేశించింది. సిక్కుల పవిత్ర గ్రంథాన్ని అగౌరవపరిచే చర్యలకు పాల్పడిన వారికి ఈ బిల్లు యావజ్జీవ కారాగార శిక్ష వరకు విధించే వీలు కల్పిస్తుంది.‘‘గురువు స్థానాన్ని ఎవరైనా సవాలు చేసినా సహించేది లేదు.. ఇటీవల, పంజాబ్ ప్రభుత్వం సిక్కు సమాజం, సంస్థలు లేదా శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (SGPC)ని సంప్రదించకుండా ఒక చట్టాన్ని ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రభుత్వం మొండిగా వ్యవహరించి, శాసనసభ, గవర్నర్ నుంచి ఆమోదం పొందింది. ఈ చట్టం 'పంథ్'లో చీలికకు కారణమవుతుంది. 'పంథ్'కు సంబంధించిన చట్టాలను రూపొందించే అధికారం ప్రభుత్వానికి లేదు’’ అని గర్గాజ్ స్పష్టం చేశారు.ఇదిలా ఉండగా, వివాదంపై ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. భగవంత్ మాన్ తక్షణమే రాజీనామా చేయాలని పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా డిమాండ్ చేశారు. ‘‘అకాల్ తఖ్త్ చేపట్టిన ఫోరెన్సిక్ విచారణ తర్వాత భగవంత్ మాన్‌ను 'తంఖైయా' (మతపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడిన దోషి)గా ప్రకటించారు. సిక్కు సమాజం ఆయనకు దూరంగా ఉండాలని కోరారు.. ఇంతటి తీవ్రమైన నిర్ణయం తర్వాత మాన్ ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కును కోల్పోయారు. అకాల్ తఖ్త్ సాహిబ్ సర్వోన్నత అధికారాన్ని, సిక్కుల మనోభావాలను గౌరవిస్తూ భగవంత్ మాన్ వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి’’ అని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.