కారు కొనడం అనేది చాలా మందికి జీవితకాల కల. రూపాయి రూపాయి పోగు చేసి.. లోన్ తీసుకుని మరీ కారు కొనుగోలు చేసేవారు చాలా మంది ఉంటారు. పాత కార్లు కొంటే రోడ్డుపై ఎక్కడ, ఎప్పుడు ఆగిపోతాయోనని భయపడి.. అప్పు చేసి అయినా సరే కొత్త కారు కొంటున్నారు. అయితే ఇలా ఎన్నో కలలు, ఆశలతో కొత్త కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తికి ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. రూ.25 లక్షలు ఖర్చు పెట్టి కారు కొంటే.. 5 కిలోమీటర్లు కూడా ప్రయాణించకుండానే.. ఆగిపోవడంతో.. అతడికి గుండె ఆగినంత పనిఅయింది. దీంతో ఆ కారు షోరూం సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. హైదరాబాద్‌లోని రాయదుర్గంలో ఉన్న విన్‌ఫాస్ట్ కార్ల షోరూంకు వెళ్లిన ఓ వ్యక్తి.. రూ.25 లక్షలు పెట్టి కారు కొనుగోలు చేశాడు. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఆ వ్యక్తి.. కారును తీసుకుని బయటికి వెళ్లాడు. ఈ క్రమంలోనే 5 కిలోమీటర్లు తిరిగేసరికి ఆ కారు ఆగిపోయినట్లు ఆ వ్యక్తి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో ఆ కారు ఆగిపోవడంతో వెంటనే తిరిగి షోరూమ్‌కి వచ్చి.. సిబ్బందికి చెప్పాడు. అయితే దానికి తమకు ఎలాంటి సంబంధం లేదంటూ షోరూం సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో ఆ వ్యక్తి షాక్‌కు గురయ్యాడు. అయినప్పటికీ.. గట్టిగా షోరూం సిబ్బందిని నిలదీస్తే.. కారును రిపేర్ చేసి ఇస్తామని తీసుకున్నారని.. అయితే కారు ఇచ్చి ఇప్పటికి 10 రోజులు దాటిపోయినా.. తన కారును తిరిగి ఇవ్వడం లేదని బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. కారును రీప్లేస్ చేసి.. మరో కారు ఇవ్వాలని అడిగితే చేయబోమని అంటున్నారని.. తాను కట్టిన డబ్బులు ఇవ్వాలని అడిగినా ఇవ్వడం లేదని వాపోతున్నారు. కారు స్పేర్ పార్ట్స్‌ వచ్చేంతవరకు ఆగితే.. దాన్ని రిపేర్ చేసి ఇస్తామని అంటున్నారని బాధితుడు పేర్కొన్నాడు. ఇప్పటికే కన్జ్యూమర్ కోర్టు ద్వారా నోటీసులు కూడా పంపినట్లు చెప్పాడు.కారు డెలివరీ అయిన తర్వాత అది ఆగిపోతే.. దానికి, తమకు ఎలాంటి సంబంధం లేదని షోరూం యాజమాన్యం చేతులెత్తేసిందని ఆరోపించాడు. వారి తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. ఆ షోరూం ముందు నిరసన తెలపడానికి ప్రయత్నించగా.. తనను బలవంతంగా షోరూం సిబ్బంది బయటికి పంపించేందుకు ప్రయత్నాలు చేసినట్లు ఆరోపించాడు. దీంతో షోరూం ముందే నిలిపివేసి యాజమాన్య వైఖరికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. కారు ఆగిపోవడానికి టెక్నికల్ లోపం కారణమా లేక మరేదైనా సమస్య ఉందా అనేది తేలాల్సి ఉంది.