ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు బెంగళూరు ఊరట దక్కింది. తెలంగాణలోని కోడి చెరువు భూముల వ్యవహారంలో కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ భూముల అంశంలో పవన్ కళ్యాణ్‌పై నిరాధారమైన సమాచారంతో కూడిన పోస్టులను, వీడియోలను, కంటెంట్‌ను తొలగించాలని ఎక్స్ మెటా, గూగుల్ ఇండియా, యూట్యూబ్, గూగుల్ యాజమాన్యాలను కోర్టు ఆదేశించింది. తప్పుడు ప్రచారం చేస్తున్న యూఆర్‌ఎల్‌లను బ్లాక్ చేయాలని సూచించింది పవన్‌ కళ్యాణ్ తరపున రామ్‌ప్రసాద్‌ (జీపీఏ హోల్డర్‌) బెంగళూరులోని 16వ సిటీ సివిల్‌ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోడి చెరువు భూములకు సంబంధించి జరుగుతున్న ప్రచారంపై దాఖలైన ఈ కేసులో విచారణ పూర్తయ్యేంత వరకు.. పిటిషనర్‌కు పరువు నష్టం కలిగించే ఎలాంటి ప్రకటనలు, ఆరోపణలు, వ్యాఖ్యానాలు, కథనాలు, వీడియోలు ప్రసారం చేయకూడదని కోర్టు ఆదేశించింది. ఈ నెల 10న మధ్యంతర తీర్పును కూడా కోర్టు సవరించింది. జాన్‌ డో ఆదేశాన్ని (అనామక అకౌంట్ల నుంచి ప్రసారమయ్యే పోస్టులను నియంత్రించాలని) జారీ చేసింది.. జులై 24కు ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను వాయిదా వేసింది.తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం జన్వాడలో కోడి చెరువు ఉంది. అయితే డిప్యూటీ సీఎం అక్కడ భూముల్ని ఆక్రమించుకున్నారంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశంపై స్పందించారు.తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు డిప్యూటీ సీఎం. ఒకవేళ తాను చెరువు భూమిని కబ్జా చేసినట్లు నిరూపిస్తే.. తన జన్వాడ ఇంటిని తానే స్వయంగా తగలబెట్టుకుంటానని ఘాటుగా స్పందించారు. అలాగే పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసిన భూమికి సంబంధించిఅన్ని రిజిస్ట్రేషన్ పత్రాలు, అనుమతులు ఉన్నాయని జనసేన పార్టీ నేతలు క్లారిటీ ఇచ్చారు. కొంతమంది రాజకీయ కక్షతో, పవన్ ఎదుగుదలను ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. అక్కడ ఎలాంటి ఆక్రమణలు చేయలేదని.. పవన్ కళ్యాణ్ ప్రతిష్టను దెబ్బ తీయాలనే కొందరు ఇలా చేస్తున్నారన్నారు.