ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ శాఖ ఐఎండీ కాస్త ఉపశమనం కలిగించే చల్లని కబురు చెప్పింది. రాబోయే రెండు గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా కురిసే అవకాశాలు మెండుగా ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, రంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయన్నారు. అయితే ఇవి కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతాయని.. రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు ఇప్పటికీ పొడిగానే ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల పురోగతిపై ఐఎండీ కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను రుతుపవనాలు పూర్తిగా ఆవరించాయని తెలిపింది. జూన్ 23 నాటికి ఇవి తెలంగాణతో పాటు ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మరింత ముందుకు విస్తరించేందుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో రాబోయే నాలుగు నుంచి ఐదు రోజుల్లో ఈ రాష్ట్రాల్లో విస్తృతంగావర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇదే సమయంలో ఈశాన్య భారతదేశంతో పాటు ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్ పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే నమోదైంది. సాధారణంగా ఈ సమయానికి రాష్ట్రంలో సగటున 63 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ప్రస్తుతానికి కేవలం 51 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. అంటే మొత్తంగా చూస్తే దాదాపు 20 శాతం మేర వర్షపాత లోటు కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లాల్లో దాదాపు 19 జిల్లాల్లో 50 శాతానికి పైగా లోటు ఉండటం గమనార్హం. ఇందులో అత్యధికంగా హనుమకొండ జిల్లాలో 77 శాతం వర్షపాత లోటు నమోదైంది. హనుమకొండతో పాటు పెద్దపల్లి, జగిత్యాల, సిద్దిపేట జిల్లాల్లో కూడా వాతావరణం పొడిగా మారి వర్షపాత లోటు అత్యంత తీవ్రంగా ఉంది. జూలై మాసంలోనైనా ఈ పరిస్థితిలో మార్పు వస్తుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.వర్షాలు లేకపోవడంతో రాష్ట్రంలో మళ్లీ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఎండల ప్రభావం మళ్లీ మెుదలైంది. మొత్తం 19 జిల్లాల్లో వేసవి తరహా వాతావరణం కొనసాగుతుండటంతో అటు ప్రజలు, ఇటు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రుతుపవనాలు సకాలంలో రాకపోవడం, ఎండలు మండుతుండటంతో వ్యవసాయ పనులపై ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ అధికారులు రైతులకు కీలకమైన హెచ్చరికలు జారీ చేశారు. వర్షాలు సక్రమంగా కురిసి, భూమి పదునైన తర్వాతే విత్తనాలు వేయాలని సూచించారు. తొందరపడి ముందే విత్తనాలు వేస్తే.. ప్రస్తుతమున్న తీవ్రమైన ఎండలకు అవి మాడిపోయి మొలకెత్తకుండానే చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.