ఆన్‌లైన్ కేటుగాళ్ల చేతిలో చిక్కి తీవ్రంగా నష్టపోతున్న సైబర్ నేరాల బాధితులకు తెలంగాణ పోలీసులు, న్యాయ సేవా అధికార సంస్థలు బిగ్ రిలీఫ్ ఇచ్చాయి. ప్రత్యేకంగా నిర్వహించిన లోక్‌అదాలత్‌ వేదికగా సైబర్ మోసాలకు గురైన బాధితులకు భారీ ఎత్తున నగదును రీఫండ్ చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారులు అధికారికంగా వెల్లడించారు. ఈ ప్రత్యేక డ్రైవ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6303 మంది సైబర్ మోసం బాధితులకు ఏకంగా రూ. 45.21 కోట్ల రూపాయలను విజయవంతంగా వారి ఖాతాల్లోకి రిఫండ్‌ చేయించారు. కోల్పోయిన సొమ్ము మళ్లీ చేతికి రావడంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ రికవరీ ప్రక్రియలో సైబరాబాద్‌ పోలీస్ కమిషనరేట్‌ అత్యంత కీలకపాత్ర పోషించి ముందంజలో నిలిచింది. ఒక్క సైబరాబాద్ పరిధిలోనే 2,232 మంది బాధితులకు చెందిన రూ. 21.91 కోట్లు రికవరీ చేసి వెనక్కి ఇప్పించారు. అదేవిధంగా.. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నేరుగా తన పరిధిలోని 77 మంది బాధితులకు సంబంధించిన రూ. 6.83 కోట్లను రికవరీ చేసింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. మల్కాజిగిరి, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాలు సైబర్ నేరగాళ్ల బ్యాంక్ ఖాతాల నుంచి సొమ్మును రికవరీ చేయడంలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచాయి.రాష్ట్రంలో సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ప్రారంభమైన నాటి నుండి నేటివరకు అద్భుతమైన ఫలితాలను సాధించింది. ఈ బ్యూరో వ్యవస్థ ఏర్పాటైనప్పటి నుండి ఇప్పటివరకు మొత్తం 59,953 మంది బాధితులకు రూ. 445.41 కోట్ల రూపాయలను రిఫండ్ చేయించి రికార్డు సృష్టించింది. ప్రస్తుత 2026 సంవత్సరంలోనే.. జూన్ 20వ తేదీ వరకు సైబర్ మోసగాళ్ల ముఠాల నుండి రూ. 70.07 కోట్లను పోలీసులు రికవరీ చేసి ఫ్రీజ్ చేయించారు. సైబర్ నేరగాళ్లు ఎక్కువగా వాడుతున్న యూపీఐ మోసాలు, నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్‌లు, ఇంపర్సనేషన్ స్కామ్‌ల బాధితులకు పోలీసులు ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో వేగంగా న్యాయం చేకూర్చారు.ఈ సందర్భంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు ప్రజలకు ఒక ముఖ్యమైన సాంకేతిక విజ్ఞప్తి చేశారు. ఆన్‌లైన్ లేదా సైబర్ మోసం జరిగిన వెంటనే బాధితులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే 1930 అనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి తమ ఫిర్యాదును నమోదు చేయాలని కోరారు. మోసం జరిగిన మొదటి గంటను వైద్య పరిభాషలో లాగే సైబర్ క్రైమ్‌లోనూ గోల్డెన్ అవర్‌గా పరిగణిస్తారని వివరించారు. ఈ గోల్డెన్ అవర్‌లో గనుక బాధితులు అప్రమత్తమై 1930 నంబర్‌కు ఫిర్యాదు ఇస్తే.. నేరగాళ్లు ఆ సొమ్మును వేరే అకౌంట్లలోకి మార్చకముందే వారి బ్యాంక్ ఖాతాలను పోలీసులు సులభంగా ఫ్రీజ్ చేయగలుగుతారు. దీనివల్ల బాధితులకు తమ డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు అత్యధికంగా ఉంటాయని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు.