ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు పోలీసులు నోటీసులు జారీ చేసారు. జూన్ 22వ తేదీ హిరమండలం పోలీస్ స్టేషన్‌కు రావాలంటూ జారీ చేశారు. 2025 మార్చి నెలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని మీద హిరమండలం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జనసేన నేత పిన్నింటి చిన్నారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే విచారణకు రావాలంటూ తాజాగా నోటీసులు జారీ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో కలకలం రేపాయి. జనసేన నేతలు భగ్గుమన్నారు. పలు పోలీస్ స్టేషన్లలో దువ్వాడ శ్రీనివాస్ మీద ఫిర్యాదులు చేశారు. దువ్వాడ ఏమన్నారంటే..మరోవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ప్రశ్నించకుండా ఉండేందుకు పవన్ కళ్యాణ్ నెలకు రూ.50 కోట్లు ప్యాకేజీ తీసుకుంటున్నారంటూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో కనిపించలేదంటూ శాసనసభ సమావేశాల ముందు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై మండిపడుతూ రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల దువ్వాడపై కేసులు నమోదయ్యాయి. గుంటూరు, పశ్చిమగోదావరి, విజయనగరం, అవనిగడ్డ, మచిలీపట్నం ఇలా చాలాచోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లా దువ్వాడ శ్రీనివాస్‌ను విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జూన్ 22వ తేదీన దువ్వాడ విచారణకు హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు పవన్ కళ్యాణ్ దూషించారంటూ గతంలోనూ దువ్వాడపై ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి టెక్కలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా.. పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. దీంతో దివ్వెల మాధురితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ గతంలో టెక్కలి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు.ఇప్పుడు హిరమండలం పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరవుతారా లేదా అనేది ప్రాధాన్యం సంతరించుకుంది.