హైదరాబాద్‌లో రాత్రిపూట రోడ్లపై జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకునేందుకు.. ఇటీవల స్వయంగా కీలక ఆపరేషన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆమె అర్ధరాత్రి పూట దిల్‌సుఖ్‌నగర్‌లో సాధారణ మహిళ వేషంలో.. బస్టాండ్‌లో నిలబడగా.. ఏకంగా 40 మంది పోకిరీలు ఆమెను చుట్టుముట్టి.. వస్తావా, నీ రేటెంత అంటూ వేధింపులకు గురి చేశారు. దీంతో సీపీ సుమతితో వచ్చిన పోలీసులు దూరంగా ఉండి.. వీడియోలు రికార్డ్ చేసి.. ఆ యువకులను అందర్నీ పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే ఈ ఘటన జరిగి నెలరోజులు తిరక్కముందే.. మళ్లీ నగర రోడ్లపై అలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. తాజాగా కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డు (కేపీహె‌చ్‌బీ) పరిధిలో అర్ధరాత్రి నడిరోడ్డుపై యథేచ్ఛగా అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్న వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కేపీహెచ్‌బీ బస్టాండ్, మెట్రో స్టేషన్‌ పరిసర ప్రాంతాల్లో మాస్కులు ధరించిన అమ్మాయిలు, మహిళలు.. బైక్‌లు, కార్లలో వచ్చిన యువకులు, పురుషులతో రోడ్డు మొత్తం రద్దీగా ఉన్న దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీంతో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాల వల్ల రోడ్లపై ప్రయాణించే నగరవాసులకు తీవ్ర ఇబ్బందులు, అసౌకర్యం కలుగుతోందని భావించిన సీపీ సుమతి.. ఇటీవల పెద్ద ఆపరేషన్ చేపట్టినా పరిస్థితి మాత్రం మారడం లేదని నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కేవలం ఇలాంటి ఆపరేషన్లు మాత్రమే చేస్తే సరిపోదని కామెంట్లు పెడుతున్నారు. నడిరోడ్డుపై యువతీయువకులు, మహిళలు, పురుషులు ఇలా చేస్తున్నా పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలని.. పెట్రోలింగ్ కూడా పెంచాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. నగరంలోని కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, పంజాగుట్ట, దిల్‌సుఖ్ నగర్ ప్రాంతాల్లో రాత్రి అయిందంటే చాలు.. రోడ్లపై యువతులు చేరుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. వారి కోసం యువకులు, పురుషులు వచ్చి.. రేటు మాట్లాడుకుని వారిని ఓయో రూంలు, ఇళ్లకు తీసుకెళ్తున్నట్లు పేర్కొంటున్నారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాల వల్ల ఆ ప్రాంతాల్లో నివసించాలన్నా, అటుగా వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిసార్లు సాధారణంగా రోడ్లపై వెళ్లే మామూలు మహిళలకు ఇలాంటి వేధింపులు తప్పడం లేదని వాపోతున్నారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.