News :దేశంలోని దిగ్గజ మల్టీనేషనల్ హెల్త్‌కేర్ గ్రూప్, వైద్య సేవల సంస్థ అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అపోలో హాస్పిటల్స్ నుంచి కొత్తగా ఏర్పడుతున్న డిజిటల్ హెల్త్, ఫార్మసీ, వైద్య సేవల విభాగం అపోలో హెల్త్‌టెక్‌ను త్వరలో స్టాక్ ఎక్స్చేంజీల్లో ఐపీఓ ద్వారా లిస్టింగ్ చేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్ పర్సన్‌గా శోభనా కామినేనిని నియమించనున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా తన వ్యాపార పునర్ వ్యవస్థీకరణ పనుల్ని వేగవంతం చేసిందని చెప్పొచ్చు. అపోలో హెల్త్‌టెక్‌ను సింపుల్‌గా మెడికల్ ఎక్విప్‌మెంట్ విభాగంగా చెబుతున్నారు. ప్రస్తుతం .. అపోలో హాస్పిటల్స్ బోర్డులో ప్రమోటర్ డైరెక్టర్‌గా ఉన్నారు.ఆమె నియామకానికి సంబంధించిన అదనపు సమాచార నివేదికను స్టాక్ ఎక్స్చేంజీలకు సోమవారమే సమర్పించింది. ఇకపై అపోలో హెల్త్‌టెక్ తదుపరి వృద్ధి దశను ఆమె నడిపించనున్నారని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ నియామకానికి వాటాదారులు సహా NCLT ఆమోదం లభించాల్సి ఉంటుంది.అపోలో హెల్త్‌టెక్ ఐపీఓ..అపోలో హాస్పిటల్స్ డిజిటల్ హెల్త్, ఫార్మసీ వ్యాపారాల్ని వేరు చేసి సుమారు 18-24 నెలల్లోగా ప్రత్యేకంగా స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ చేయాలన్న లక్ష్యంతోనే అపోలో గ్రూప్ పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికల్ని ప్రకటించింది. ఇక లిస్టింగ్ నాటికి అపోలో హెల్త్‌టెక్ ద్వారా ఏటా దాదాపు రూ. 25 వేల కోట్ల ఆదాయం సాధించాలన్నదే లక్ష్యంగా పెట్టుకుంది. రోగులకు మరింత మెరుగైన డిజిటల్ వైద్య సేవల్ని కల్పించాలన్న లక్ష్యంతో అపోలో.. ఈ హెల్త్‌టెక్ కంపెనీని ప్రత్యేక యూనిట్‌గా స్పిన్ ఆఫ్ చేస్తోంది. దీంట్లో అపోలో 24/7 డిజిటల్ ప్లాట్‌ఫారం, ఓమ్ని ఛానెల్ ఫార్మసీ డిస్ట్రిబ్యూషన్, టెలీహెల్త్ డివిజన్లు కలిసి పనిచేస్తాయి.నలుగురు కుమార్తెలు కీలక బాధ్యతల్లో..అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు ప్రతాప్ సి. రెడ్డి మూడో కుమార్తెనే శోభనా కామినేని. ఈమె అగ్రహీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని కొణిదెల తల్లి. ప్రతాప్ రెడ్డి మిగతా కుమార్తెల విషయానికి వస్తే వీరు కూడా అపోలో హాస్పిటల్స్ గ్రూపులోనే కీలక పదవుల్లో ఉండి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డాక్టర్ ప్రీతారెడ్డి అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్‌పర్సన్‌గా ఉండగా.. సునీతా రెడ్డి గ్రూపులో మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. డాక్టర్ సంగీతా రెడ్డి జాయింట్ ఎండీగా ఉన్నారు. ప్రతాప్ రెడ్డికి కుమారులు లేరు. ఇక ఉపాసన కూడా అపోలో హాస్పిటల్స్ గ్రూపులో భాగమయ్యారు. ఆమె అపోలో హాస్పిటల్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (CSR) వైస్ ఛైర్ పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈమె స్వయంగా ఒక వెల్‌నెస్ ప్లాట్‌ఫాం URLife ను కూడా స్థాపించారు. దీనికి ఫౌండర్, ఎండీగా ఉన్నారు. అపోలో హాస్పిటల్స్ షేర్లు..అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌‌ప్రైజ్ లిమిటెడ్ ఇప్పటికే స్టాక్ మార్కెట్లో లిస్టయి ఉండగా.. ప్రస్తుతం వార్త రాసే సమయంలో జూన్ 16న మధ్యాహ్నం 12 గంటలకు షేర్ ధర రూ. 8,444 వద్ద ఉంది. మార్కెట్ విలువ రూ. 1.21 లక్షల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 8,624 గా ఉండగా.. కనిష్ఠ ధర రూ. 6,696.50 గా ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 20 శాతం పెరిగింది.