భారత్‌లో టెలిగ్రామ్ బ్యాన్.. నీట్ రీ ఎగ్జామ్ ముందు కేంద్రం కీలక నిర్ణయం

Wait 5 sec.

నీట్ - 2026 ప్రశ్నాపత్రం లీకేజ్ తర్వాత ప్రభుత్వం మళ్లీ ఎగ్జామ్ నిర్వహించనుంది. జూన్ 21న జరగనున్న నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌కు ముందు టెలిగ్రామ్ యాప్‌ను తాత్కాలికంగా బ్యాన్ చేయాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) స్వాగతించింది. పేపర్ లీకేజ్‌లు, పరీక్షలకు సంబంధించిన మోసాలు, తప్పుడు సమాచారాలను అరికట్టేందుకు ఈ చర్యలు అవసరమని ఎన్‌టీఏ పేర్కొంది. ఎన్‌టీఏ తాజాగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఐటీ మంత్రిత్వ శాఖ సూచనల మేరకు జూన్ 22 వరకు భారత్‌లో టెలిగ్రామ్ యాక్సెస్‌పై తాత్కాలిక ఆంక్షలు విధించింది. అదేవిధంగా టెలిగ్రామ్‌లోని మెసెజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను జూన్ 30 వరకు భారత్‌లో నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. టెలిగ్రామ్‌పై ఆంక్షలు తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే.. ఎన్‌టీఏ ప్రకారం, పరీక్ష పూర్తయిన తర్వాత కొందరు టెలిగ్రామ్ ఛానల్ నిర్వాహకులు పాత పోస్టులను ఎడిట్ చేసి, వాటికి ప్రశ్నాపత్నాలను జత చేసి పేపుర్ లీక్ జరిగింది అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు గుర్తించారు. ఈ విధంగా నకిలీ ఆధారాలు సృష్టించి గందరగోళ పరిస్థితులను సృష్టిస్తున్నారని.. అందుకే టెలిగ్రామ్ తాత్కాలిక బ్యాన్‌తో పాటు, మెసెజ్ ఎడిటింగ్ ఫీచర్‌నూ తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. కేంద్ర హోం శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కూడా ఇప్పటికే రంగంలోకి దిగింది. పలు అనుమానిత టెలిగ్రామ్ ఛానళ్లు, గ్రూపులను తొలగించారు. బిహార్, అహ్మదాబాద్‌లో కూడా పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థులకు సూచనలు చేశారు. ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని ఎవరైనే చెబితే నమ్మొద్దని ముందుగానే అవగాహన కల్పించారు. అహ్మదాబాద్‌‌లో టెలిగ్రామ్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న ఓ అంతరాష్ట్ర ముఠాను కూడా పోలీసులు అరెస్టు చేశారు. టెలిగ్రామ్‌పై ఆంక్షలు జూన్ 22 తర్వాత తొలగిస్తామని ఎన్టీఏ పేర్కొంది. విద్యార్థులు కూడా పేపర్ లీక్ పేరుతో మోసపోవద్దని, ఎవ్వరికీ ఎలాంటి డబ్బులు ఇవ్వొద్దని సూచించింది. పేపర్ పేరుతో వచ్చే వాటిని నమ్మి మోసపోవద్దని చెప్పింది.