మోదీ సర్కార్ స్కెచ్ ఫలించింది.. బంగారం, వెండికి భారీగా తగ్గిన డిమాండ్.. ఈ లెక్కలు చూస్తే..!

Wait 5 sec.

: కేంద్ర ప్రభుత్వం మే నెలకు సంబంధించి ఎగుమతి, దిగుమతుల డేటాను విడుదల చేసింది. ఏప్రిల్ నెలలో సుమారు 5.63 బిలియన్ డాలర్ల విలువైన బంగారం మన దేశంలోకి రాగా.. ఇది మే నెలలో 3.42 బి. డాలర్లకు పరిమితమైంది. ముందటి నెలతో పోలిస్తే ఇక్కడ బంగారం దిగుమతుల విలువ దాదాపు 40 శాతం తగ్గడం గమనార్హం. భారత్ ఎక్కువగా పసిడి వినియోగంలో దిగుమతులపైనే ఆధారపడుతుంది కనుక దిగుమతులు తగ్గితే దానికి అనుగుణంగానే కొనుగోళ్లు తగ్గుతాయని చెప్పొచ్చు. అంటే డిమాండ్ పడిపోయినట్లే. అంతకుముందు ఏడాది మే నెలతో పోలిస్తే మాత్రం అంటే వార్షిక ప్రాతిపదికన చూస్తే 34 శాతం వరకు పెరిగింది. ఏడాది కిందట ఏప్రిల్- మే నెల సమయంతో పోలిస్తే పసిడి దిగుమతుల విలువ ఈ ఏప్రిల్- మే లో 60 శాతానికిపైగా పెరిగి 9.04 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.ఇక వెండి దిగుమతులు రికార్డు స్థాయిలో పతనం అయ్యాయి. ఏప్రిల్ నెలలో 411.06 మిలియన్ డాలర్లుగా ఉండగా.. ఇది 75.57 మి. డాలర్లకు పరిమితమైంది. ఇక్కడ రికార్డు స్థాయిలో 80 శాతానికిపైగా తగ్గడం గమనార్హం. గతేడాది మే నెలతో పోలిస్తే అప్పుడు వెండి దిగుమతుల విలువ రికార్డు స్థాయిలో 566.22 మిలియన్ డాలర్లుగా ఉండగా ఇప్పుడు అది 75.57 మిలియన్ డాలర్లకు పడిపోవడం గమనార్హం. ఇది దాదాపు 87 శాతం పతనంగా చెప్పొచ్చు. ఇక పరిమాణం (వాల్యూమ్స్) పరంగా చూస్తే వార్షికంగా 94 శాతం తగ్గి 33 మెట్రిక్ టన్నులకు చేరింది. ఇక్కడ ఏప్రిల్- మే నెలల్లో చూస్తే వెండి దిగుమతులు 33 శాతం తగ్గి 486.58 మిలియన్ డాలర్లకు పడిపోయాయి.భారీగా పెరిగిన దిగుమతి సుంకాలు..భారత్ ఎక్కువగా బంగారం, వెండి విషయంలో దిగుమతులపైనే ఆధారపడుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇటీవలి పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దిగుమతులపై ఆంక్షలు విధించింది. మే నెలలోనే . కంపెనీలు చేసుకునే దిగుమతులపైనా పరిమితులు విధించింది. దీంతో ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో బంగారం, వెండికి డిమాండ్ భారీగా తగ్గి.. దిగుమతులు తగ్గాయని చెప్పొచ్చు.ఒకవైపు క్రూడాయిల్ ధరలు పెరగడంతో ఆ దిగుమతుల బిల్లు పెరిగి భారత విదేశీ మారకంపై ప్రభావం పడుతుంది. ఇదే సమయంలో బంగారం దిగుమతులూ పెరుగుతున్నాయి. దీంతో యుద్ధం నేపథ్యంలో విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడం సహా ఉన్న విదేశీ మారకాన్ని ఆదా చేసుకునేందుకు భారతీయుల్ని ఏడాది పాటు బంగారం కొనొద్దని కూడా ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు కూడా కొనుగోళ్లు చేయొద్దని కోరారు. దీంతో మొత్తంగా డిమాండ్ దిగిరావడం గమనించొచ్చు. స్విట్జర్లాండ్ వాటానే 40 శాతం..ఇక భారత్ బంగారం దిగుమతుల విషయంలో అత్యధికంగా స్విట్జర్లాండ్‌పై ఆధారపడుతోంది. మొత్తం దిగుమతుల్లో ఆ దేశం నుంచే 40 శాతం వస్తుండటం విశేషం. తర్వాత వరుసగా యూఏఈ (16 శాతం), సౌతాఫ్రికా (10 శాతం) ఉన్నాయి. మే నెలలో స్విస్ నుంచి భారత్‌కు 57.73 శాతం తగ్గడం గమనార్హం. భారత మొత్తం దిగుమతుల్లో కూడా బంగారం వాటా సుమారు 5 శాతంగా ఉంది. ఓవరాల్‌గా చూస్తే భారత వాణిజ్య లోటు మే నెలలో 28.21 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇది ఎగుమతి, దిగుమతుల మధ్య వ్యత్యాసాన్ని సూచిస్తుంది. ఎగుమతుల కంటే దిగుమతుల బిల్లు ఎక్కువైనప్పుడే వాణిజ్య లోటు ఏర్పడుతుంది.