చీపెస్ట్ పర్సనల్ లోన్స్.. టాప్ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఇవే.. రూ. 5 లక్షల లోన్‌పై ఐదేళ్లకు నెలకు ఈఎంఐ ఎంత?

Wait 5 sec.

: మనకు చాలా అవసరాలు ఉంటాయి. రోజురోజుకూ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో జీతం ఎటూ చాలట్లేదు. దీంతో చాలా మంది అప్పులు చేస్తుంటారు. ముందుగా బంధువులు లేదా స్నేహితుల దగ్గర అడుగుతారు. అక్కడ దొరక్కపోతే ఇక బ్యాంకుల్లో లోన్ తీసుకునేందుకు మొగ్గుచూపుతుంటారు. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా బ్యాంకులు లోన్లు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. ఇంకా పెద్దగా పేపర్ వర్క్ కూడా ఉండట్లేదు. క్షణాల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ చేస్తుండటం గమనార్హం. ఇక ఆర్బీఐ కీలక రెపో రేట్లను వరుసగా తగ్గిస్తూ వచ్చిన నేపథ్యంలో వడ్డీ రేట్లు కూడా కనిష్ఠ స్థాయిలకు పడిపోయాయి. ఇప్పుడు చాలా తక్కువ వడ్డీ రేట్లకే పర్సనల్ లోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు దేశంలోని టాప్ ప్రైవేట్ బ్యాంకుల్లో ఎలా ఉన్నాయి.. 5 లక్షల లోన్ తీసుకున్నట్లయితే ఐదేళ్ల కాలానికి ఈఎంఐ నెలకు ఎంత పడుతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా అత్యవసరాల కోసం ఆస్పత్రిలో చికిత్స కోసం లేదా హోం రెనోవేషన్‌కు, ఫ్యామిలీతో కలిసి ఎటైనా దూర ప్రాంతాలకు వెళ్లాలన్నా, పెళ్లి చేయాలన్నా ఇలా చాలా అవసరాలకు లోన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు 2026 జూన్ నెలలో దేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంకుల్లో చూస్తే యాక్సిస్ బ్యాంకులో కనీసం 8.95 శాతం నుంచే పర్సనల్ లోన్ వస్తుంది. ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజు లోన్ మొత్తంలో 2 శాతం వరకు ఉంటుంది. మెరుగైన సిబిల్ స్కోరు ఉంటే కనీస వడ్డీ రేటుకే లోన్ వస్తుంది. ఇక్కడ 5 లక్షల పర్సనల్ లోన్ తీసుకున్నవారికి ఐదేళ్లకు నెలకు ఈఎంఐ రూ. 10367 చొప్పున పడుతుంది. ఐదేళ్ల కాలానికి వడ్డీ రూపంలో మొత్తం రూ. 1,22,023 చెల్లించాల్సి వస్తుంది. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకులో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో 9.99 శాతం నుంచి వడ్డీ రేట్లు ఉండగా, ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజు రూ. 6500 వరకు ఉంటుంది. ఇక్కడ 5 లక్షలపై ఐదేళ్లకు నెలకు రూ. 10,621 చొప్పున పడుతుంది. ఇక్కడ మొత్తం చెల్లించాల్సిన వడ్డీ రూ. 1.37 లక్షలుగా ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకుల్లో కూడా ఇదే 9.99 శాతం నుంచి పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు ప్రారంభం అవుతుండగా ఈఎంఐ 5 లక్షలపై అదే రూ. 10,621 చొప్పున పడుతుందని చెప్పొచ్చు. ఇక్కడ కూడా ప్రాసెసింగ్ ఫీజులు వరుసగా లోన్ మొత్తంలో 2 శాతం, 3.5 శాతంగా ఉన్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంకులో 10.49 శాతంగా వడ్డీ రేట్లు మొదలవుతున్నాయి. ఇక్కడ 5 లక్షల లోన్‌పై ఐదేళ్లకు ఈఎంఐ నెలకు రూ. 10,744 గా ఉంది. వడ్డీ మొత్తం రూ. 1.44 లక్షలు పడుతుంది. కోటక్ మహీంద్రా బ్యాంకులో వడ్డీ రేటు 10.99 శాతంగా ఉంది. లోన్ మొత్తంలో ప్రాసెసింగ్ ఫీజు 5 శాతం వరకు చెల్లించాలి. ఇక్కడ నెలకు చెల్లించాల్సిన ఈఎంఐ రూ. 10,869 గా ఉంటుంది. మొత్తం చెల్లించాల్సిన వడ్డీ రూ. 1.52 లక్షలపైనే ఉంటుంది.