మామిడి సాగు చేసే రైతులకు వాతావరణ మార్పులు, అకాల వర్షాలు ప్రతీ ఏటా తీవ్ర నష్టాలను మిగులుస్తున్నాయి. ముఖ్యంగా మామిడి పండ్ల టెంకలో చేరే ప్రమాదకరమైన పురుగులు పండ్లను వేగంగా కుళ్లిపోయేలా చేస్తూ నాణ్యతను దెబ్బతీస్తున్నాయి. ఈ సమస్య కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో మన మామిడి ఎగుమతులకు తీవ్ర విఘాతం కలుగుతోంది. ఈ నేపథ్యంలో మామిడి రైతులకు ప్రయోజనం చేకూరుస్తూ టెంకలోని పురుగులను పూర్తిగా నాశనం చేసే సరికొత్త సాంకేతిక ప్రక్రియను తెలంగాణలో అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక, సాంకేతిక సహకారంతో రాష్ట్ర ఉద్యానశాఖ అధికారులు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని శామీర్‌పేటలో రూ.24 కోట్ల భారీ బడ్జెట్‌తో ఒక అత్యాధునిక ఇరేడియేషన్ కేంద్రాన్ని నిర్మించనున్నారు.తెలంగాణలో ప్రతి సీజన్‌లో సగటున 3 లక్షల టన్నుల మామిడి పండ్లు ఉత్పత్తి అవుతుండగా.. అందులో దాదాపు 20 శాతానికి పైగా పండ్లకు టెంక పురుగు పడుతోందని అధికారిక అంచనాలు చెబుతున్నాయి. దీనివల్ల ఆశించిన ధర లభించక రైతులు తాము పండించిన పంటలో సగానికి పైగా పండ్లను పారేయాల్సి వస్తోంది. మిగిలిన పండ్లు కూడా రవాణా దశలోనే వేగంగా కుళ్లిపోతుండటంతో రైతులు కోట్లలో నష్టపోతున్నారు. ఈ ఏడాది జపాన్ మన దేశం నుంచి వెళ్లే మామిడి పండ్ల ఎగుమతులపై నిషేధం విధించిన నేపథ్యంలో.. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవడానికి ఈ ఇరేడియేషన్ ప్రాజెక్టును రాబోయే 12 నెలల గడువులోనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.మామిడి చెట్లకు పిందెలు కాసి నిమ్మకాయ పరిమాణంలో ఉన్నప్పుడే ఫ్రూట్‌ఫ్లై అనే సూక్ష్మజీవి వాటి తొక్క ద్వారా లోపలికి ప్రవేశిస్తుందని ఉద్యానవనశాఖ అధికారులు చెబుతున్నారు. కాయ పరిమాణం పెరుగుతున్న కొద్దీ అది టెంక లోపలికి చేరి స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. కాయ పూర్తిగా పక్వానికి వచ్చి పండుగా మారే సమయంలో ఈ సూక్ష్మజీవి పెద్ద పురుగుగా మారి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా వేసవిలో అకాల వర్షాలు కురిస్తే ఈ పురుగులు టెంక నుంచి బయటకు వస్తాయి. ఫలితంగా పండును కోసినప్పుడు టెంక చివరన పురుగు కనిపిస్తుంది. రాష్ట్రంలో ఎక్కువగా పండించే బేనిషాన్ రకంలో ఈ సమస్య అత్యధికంగా ఉండగా.. ఆ తర్వాత హిమాయత్, మల్లిక వంటి రకాల్లోనూ ఇది ఎక్కువగా కనిపిస్తోంది.ఈ సమస్యకు పరిష్కారంగా తీసుకొస్తున్న రేడియేషన్ ప్రక్రియలో మామిడిపండ్లను తొలుత ఒక ప్రత్యేక క్వారంటైన్ తరహా గదిలోకి తరలిస్తారు. అక్కడ అంతర్జాతీయ ప్రమాణాల నడుమ సాంకేతిక నిపుణులు పండ్లపైకి శక్తిమంతమైన గామా కిరణాలను ప్రసరింపజేస్తారు. ఈ కిరణాలు పండు లోపలికి చొచ్చుకుపోయి, పండు నాణ్యతను గానీ, రుచిని గానీ మార్చకుండా టెంక లోపల దాగున్న పురుగులను, వాటి గుడ్లను పూర్తిగా నిర్మూలిస్తాయి. దీనివల్ల పండ్లు ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండే కాలం కూడా పెరుగుతుంది.నిజానికి ఈ ఇరేడియేషన్ కేంద్రం స్థాపన అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో గత పదేళ్ల నుంచి ప్రతిపాదనలు ఉన్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అభ్యర్థన మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టీకల్చర్ పథకం కింద ఈ కేంద్రానికి నిధులు మంజూరయ్యాయి. శామీర్‌పేటలో పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. దీనికి అదనంగా రంగారెడ్డి జిల్లా కోహెడలోని అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్‌లోనూ మరొక ఇరేడియేషన్ కేంద్రాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ముంబయి, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో మాత్రమే ఉన్న ఈ సౌకర్యం త్వరలోనే తెలంగాణలో అందుబాటులోకి రానుండటం ఇక్కడి మామిడి సాగుదారులకు పెద్ద ఊరటనిచ్చే అంశం.