ఐపీఎల్ 2026లో పేలవ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించిన జట్టులో భారీ ప్రక్షాళన చేసేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా కోచింగ్ స్టాఫ్ విషయంలో ఆ ఫ్రాంఛైజీ కీలక నిర్ణయం తీసుకుంటోంది. గత సీజన్‌లో 14 పాయింట్లతో ఆరో ప్లేసులో నిలిచింది డీసీ. ఈ నేపథ్యంలో కోచింగ్ బృందంలో సమూల మార్పులు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా.. వేణుగోపాల్ రావు, హేమంగ్ బదానీ, మునాఫ్ పటేల్‌ను తప్పించనున్నట్లు తెలుస్తోంది. భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్‌ను బ్యాటింగ్‌ కోచ్‌గా తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఐపీఎల్ 2027 కోసం ఫ్రాంఛైజీకి బ్యాటింగ్ కోచ్‌గా ఉండాలని డీసీ.. యువరాజ్‌ను సంప్రదించిందట. అందుకు యువీ కూడా సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే సీజన్‌లో అతడు ఢిల్లీ క్యాపిటల్స్ కోచింగ్ స్టాఫ్‌లో కనిపించే అవకాశం ఉంది. హెడ్ కోచ్, బౌలింగ్ కోచ్‌లుగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై ఢిల్లీ క్యాపిటల్స్ ప్రస్తుతం ఫోకస్ పెట్టింది.కాగా టీమిండియా... టీ20 ప్రపంచకప్ 2007, వన్డే ప్రపంచకప్ 2011 గెలవడంలో యువీ కీలక పాత్ర పోషించాడు. ఈ రెండు టోర్నీల్లోనూ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. అంతేకాకుండా ప్రస్తుతం భారత వన్డే, టెస్ట్ జట్టు సారథి శుభ్‌మన్ గిల్.. ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా ఉన్న అభిషేక్ శర్మకు సైతం మెంటార్‌గా ఉన్నాడు. పేలవ ఫామ్‌లో ఉన్నప్పుడు రిషభ్ పంత్ సైతం యువీ సలహాలు తీసుకున్నవాడే. ఇలా పలువురు క్రికెటర్ల ఆట మెరుగవ్వడంలో కీలకపాత్ర పోషించిన యువీ సేవలు వినియోగించుకోవాలని డీసీ భావిస్తోంది. అంతేకాకుండా సౌరవ్ గంగూలీకి సైతం కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఇక ఆటగాళ్ల విషయంలోనూ డీసీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పంత్.. ఐపీఎల్ 2024 సీజన్ తర్వాత డీసీని వీడాడు. ఆపై జరిగిన వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ రూ. 27 కోట్లకు పంత్‌ను తీసుకుంది. కానీ గత రెండు సీజన్లలో అతడు సారథిగా, ఆటగాడిగా విఫలమయ్యాడు. దీంతో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీంతో జట్టును వీడాలని అతడు డిసైడ్ అయ్యాడట. మరోవైపు పంత్‌ను జట్టులోకి తీసుని.. అతడికి బదులుగా కుల్‍‌దీప్ యాదవ్‌ను వదులుకునేందుకు డీసీ సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.