వచ్చే నెల నుంచే భూముల రీ-సర్వే.. సులువుగా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు

Wait 5 sec.

తెలంగాణలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు, ల్యాండ్ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా తొలి దశ భూముల రీ-సర్వే కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం అధికారిక విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి.. శుక్రవారం హైదరాబాద్‌లోని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సుదీర్ఘ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వే ఏర్పాట్లు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై అధికారులకు పలు కీలక మార్గదర్శకాలను జారీ చేశారు.భూ సమస్యలు, భూవివాదాలు లేని సరికొత్త డిజిటల్ తెలంగాణను నిర్మించాలనేదే తమ ప్రభుత్వ ప్రధాన సంకల్పమని పొంగులేటి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రత్యేక సూచనల మేరకు.. రాష్ట్రంలో అత్యాధునిక పద్ధతుల్లో భూ సర్వే నిర్వహించాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 10,954 రెవెన్యూ గ్రామాలలో దశలవారీగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఆధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగించి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా తొలి దశలో హైదరాబాద్ జిల్లా మినహా.. మిగిలిన 32 జిల్లాల్లో అత్యంత వేగంగా సర్వే పనులు మొదలవుతాయన్నారు. ప్రతి జిల్లాలో 70 గ్రామాల చొప్పున మొదటి విడతలో మొత్తం 2,240 గ్రామాలను ఈ రీ-సర్వే కోసం ఎంపిక చేసినట్లు మంత్రి వివరించారు.ఇప్పటికే రికార్డుల్లో ప్రాథమిక నక్షాలు లేని 378 సమస్యాత్మక గ్రామాలను రెవెన్యూ అధికారులు ప్రత్యేకంగా గుర్తించారని అందులో పైలట్ ప్రాజెక్ట్ కింద ఐదు గ్రామాలలో రీ-సర్వేను విజయవంతంగా పూర్తి చేసి భూ యజమానులకు ప్రత్యేక భూదార్ నంబర్లను సైతం కేటాయించినట్లు మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. గతంలో ఉపయోగించిన గొలుసులు, జెండా కర్రలు, మెజరింగ్ టేపులు వంటి పాతకాలపు, కాలం చెల్లిన సర్వే పద్ధతులకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా స్వస్తి పలికిందన్నారు. వాటి స్థానంలో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఆధారిత డీజీపీఎస్ (DGPS), అత్యాధునిక రోవర్స్, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, క్యూజీఐఎస్ (QGIS) వంటి గ్లోబల్ స్టాండర్డ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ రీ-సర్వేలో విస్తృతంగా వినియోగిస్తున్నారన్నారు. దీనివల్ల ఒక ఇంచు భూమి కూడా అటుఇటు కాకుండా అత్యంత ఖచ్చితత్వంతో కూడిన కొలతలు రికార్డవుతాయన్నారు. ఈ డిజిటల్ రీ-సర్వే ప్రక్రియ పూర్తిగా ముగిసిన అనంతరం.. రాష్ట్రంలోని ప్రతి భూకమతానికి భూదార్ నంబరును కేటాయిస్తారన్నారు. ఆధార్ కార్డు తరహాలోనే ఈ భూదార్ నంబరుతో కూడిన ఒక ప్రత్యేక ఐడెంటిటీ కార్డును భూ యజమానులకు ప్రభుత్వం తరఫున ఉచితంగా జారీ చేయనున్నట్లు చెప్పారు. ఈ భారీ ప్రాజెక్టును సజావుగా నిర్వహించడానికి వీలుగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 5,520 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లకు కఠినమైన సాంకేతిక శిక్షణ ఇచ్చి.. వారికి అధికారిక లైసెన్సులను కూడా జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రతి మండలంలోని భూ విస్తీర్ణాన్ని, గ్రామాల సంఖ్యను బట్టి 4 నుండి 6 మంది చొప్పున సర్వేయర్లను క్షేత్రస్థాయి విధుల్లో నియమించడం జరిగిందన్నారు. ఈ సరికొత్త రీ-సర్వే పూర్తయిన తర్వాత రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల ప్రక్రియలు ఎలాంటి అవినీతికి తావులేకుండా, అత్యంత వేగంగా, పారదర్శకంగా జరుగుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.