: కొంత కాలంగా ఏఐకి డిమాండ్ విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. కొత్తగా పుట్టుకొస్తున్న ఏఐ టూల్స్.. ఐటీ, సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీకి పెను ముప్పుగా పరిణమిస్తున్నాయి. సంప్రదాయ ఐటీ సేవల డిమాండ్ తగ్గుతోంది. ఇప్పటికే ఈ ప్రభావం భారత్ సహా అంతర్జాతీయంగా ఉన్న ఐటీ/టెక్ కంపెనీలపై కనిపించింది. ఒకవైపు భారత దిగ్గజ ఐటీ స్టాక్స్ ఈ ఏఐ రాకతో భారీగా పతనం అవుతుండగా.. మరోవైపు అమెరికాలో ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ, కన్సల్టింగ్ సేవల సంస్థగా ఉన్న అసెంచర్ లిమిటెడ్‌పై అంతకంటే ఎక్కువగానే ఎఫెక్ట్ పడుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే భారీగా పతనమైన .. జూన్ 18 సెషన్‌లో యూఎస్ స్టాక్ ఎక్స్చేంజీల్లో భారీగా కుప్పకూలాయి. అంతకుముందు జూన్ 17 సెషన్‌లో 156.01 డాలర్ల వద్ద ముగియగా.. జూన్ 18 సెషన్‌లో నేరుగా ఏకంగా 18 శాతానికిపైగా పతనంతో 126.50 డాలర్ల వద్ద ఓపెన్ అయింది. ఇంట్రాడేలో మరింత భారీ పతనంతో ఏకంగా 19 శాతం తగ్గి 125.60 డాలర్ల వద్ద కనిష్ఠ స్థాయిని తాకింది. చివరకు 18 శాతం నష్టంతో 127.98 యూఎస్ డాలర్ల వద్ద స్థిరపడింది. ఐర్లాండ్ డబ్లిన్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ అసెంచర్ సంస్థ తాజాగా క్యూ3 ఫలితాల్ని ప్రకటించింది. ఈ సంస్థ సెప్టెంబర్- ఆగస్ట్ ఆర్థిక సంవత్సరాన్ని పాటిస్తుంది. ఇప్పుడు మార్చి- మే క్యూ3 త్రైమాసిక ఫలితాల్ని వెల్లడించింది. ఈ సమయంలో ఆదాయం 18.7 బిలియన్ డాలర్లుగా నమోదైంది. భారత కరెన్సీలో చూస్తే ఇది రూ. 1.76 లక్షల కోట్లుగా ఉంటుంది. వార్షిక ప్రాతిపదికన ఇది 6 శాతం ఎక్కువ. అయినప్పటికీ మార్కెట్ అంచనాల్ని అందుకోలేకపోయింది. లాభం 2.39 బిలియన్ డాలర్లుగా వచ్చింది. ఇది మన కరెన్సీలో దాదాపు రూ. 22 వేల కోట్ల వరకు ఉంటుంది. ఆదాయ వృద్ధి అంచనాల కోత ఎఫెక్ట్..అయితే ఇక్కడ సంస్థ పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయ వృద్ధి అంచనాల్ని కుదించింది. అంతకుముందు 3-5 శాతంగా ఉంటుందని అంచనా వేయగా ఇప్పుడు దానిని 3-4 శాతానికి తగ్గించింది. దీనికి తోడు కొత్త ఆర్డర్లు తగ్గడం సహా ఆదాయ అంచనాలు తగ్గడం, పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం అన్నీ కనిపించాయి. వీటికి తోడు కృత్రిమ మేధ కంపెనీ వ్యాపారాల్ని దెబ్బతీస్తాయన్న భయాలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయి. దీంతో ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడితో స్టాక్ కుదేలైంది. అసెంచర్ స్టాక్ ఈ ఏడాదిలో ఇప్పటివరకు 50 శాతానికిపైగా పతనమైంది. 6 నెలల వ్యవధిలో 53 శాతం తగ్గింది. ఫిబ్రవరి నుంచి చూస్తే ఏకంగా 65 శాతం వరకు తగ్గింది. దీంతో ఏఐ ఎఫెక్ట్ ప్రపంచంలోనే ఈ అతిపెద్ద సంస్థపై భారీగా పడిందని చెప్పొచ్చు. భారీగా తగ్గిన విప్రో, ఇన్ఫోసిస్ ఏడీఆర్..అసెంచర్ సంస్థ మొత్తం ఉద్యోగుల సంఖ్య 7.80 లక్షలకుపైగానే ఉంది. ఇందులో దాదాపు సగం వరకు అంటే 3 లక్షలకుపైగా ఉద్యోగులు భారత్ కేంద్రంగానే పనిచేస్తున్నారు. ఇక అసెంచర్ స్టాక్ పతనంతో అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజీల్లో ఉన్న భారత ఐటీ సంస్థల ఏడీఆర్‌లు (అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్) కూడా భారీగా తగ్గాయి. విప్రో, ఇన్ఫోసిస్ ఏడీఆర్‌లు దాదాపు 10 శాతం వరకు పతనం అయ్యాయి. ఇది భారత స్టాక్ మార్కెట్లోనూ ఈ ప్రభావం కనిపిస్తోంది. ఇన్ఫీ శుక్రవారం సెషన్‌లో 8 శాతానికిపైగా పడిపోగా, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా 5 శాతం, విప్రో 4 శాతం పడిపోయాయి. ఏడీఆర్ అంటే అమెరికాయేతర కంపెనీలు అక్కడి స్టాక్ మార్కెట్లలో తమ షేర్లను విక్రయించేందుకు చేసే నెగోషియబుల్ సర్టిఫికెట్లు.