నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌కి ముందు పేపర్ లీక్‌ను అరికట్టేందుకు కేంద్రం టెలిగ్రామ్‌పై తాత్కాలిక బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే, కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టెలిగ్రామ్ ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించగా.. అక్కడ కూడా టెలిగ్రామ్‌కు ఎదురుదెబ్బే తగిలింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైనదే అంటూ ఢిల్లీ హై కోర్టు స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా కేంద్రం సరైన నిర్ణయమే తీసుకుంది. ఐటీ చట్టంలోని సెక్షన్ 69ఏ ప్రకారం అన్ని విధివిధానాలను కేంద్రం పాటించింది అంటూ ఢిల్లీ హైకోర్టు శుక్రవారం విచారణ సందర్భంగా పేర్కొంది. దాంతో టెలిగ్రామ్‌కు చుక్కెదురయింది. టెలిగ్రామ్ తరఫు న్యాయవాదులు కొందరు వినియోగదారుల తప్పిదాల కోసం మొత్తం ప్లాట్‌ఫామ్‌ను బ్లాక్ చేయడం సరైనది కాదని వాదించారు. తక్కువ పరిమితులు ఉన్న ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవచ్చని, ఈ నిషేధం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని వాదించారు. అయితే, కోర్టు ఈ వాదనలను అంగీకరించలేదు. కేంద్రం తీసుకున్న చర్యలు కూడా పరిమితులతోనే ఉన్నాయని స్పష్టం చేసింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనర్ తుషార్ మెహతా వాదిస్తూ టెలిగ్రామ్ మోసగాళ్లకు ప్రధాన సాధనంగా మారిందని లేవనెత్తారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు పరీక్షను రాయనున్నారని, దాంతో తప్పిదాలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఇది ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశమని కోర్టుకు తెలిపారు. కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని ఓ కమిటీ కూడా తాత్కాలిక నిషేధం కొనసాగించడం సరైన కారణమనే కోర్టుకు తెలిపింది. మొత్తానికి వాదోపవాదనలు విన్న కోర్టు టెలిగ్రామ్ పిటిషన్‌ను తిరస్కరించింది. గత నెలలో జరిగిన నీట్ ఎగ్జామ్‌లో ప్రశ్నాపత్రం లీక్ అయిందనే వివాదం దేశవ్యాప్తంగా గందరగోళాన్ని సృష్టించింది. ఆ సమయంలో టెలిగ్రామ్ ఛానళ్లు, గ్రూపులు కీలక పాత్ర పోషించాయనే ఆరోపణలు వచ్చాయి. దాంతో జూన్ 21న జరగనున్న నీట్ రీ టెస్టుకు ముందు పేపర్ లీక్‌లు, తప్పుడు సమాచార ప్రచారం, మోసాలను అరికట్టేందుకు జూన్ 22 వరకు టెలిగ్రామ్ సేవలు తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించింది.