హైదరాబాద్‌లో ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చాయి. ట్రాఫిక్ నియంత్రణ కోసం వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళిక కింద నిర్మించిన కొత్త ప్లైఓవర్లు, అండర్‌పాసులు నగర రూపురేఖలను మార్చేశాయి. మరికొన్ని కీలక ప్రాజెక్టులు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉండగా.. ట్రాఫిక్ లేని ప్రయాణమే లక్ష్యంగా ఎలివేటెడ్ కారిడార్ల పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరవాసుల రవాణా కష్టాలను పూర్తిగా దూరం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్నమైన నిర్ణయం తీసుకుంది. ఐటీ కారిడార్ పరిసరాల్లో విపరీతంగా పెరుగుతున్న ట్రాఫిక్‌కు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు నగరంలో టన్నెల్ రోడ్లను నిర్మించబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.ఖజాగూడలోని ఎస్‌ఏఎస్‌ఐ టవర్‌లో ఎస్‌ఏఎస్‌ ఇన్‌ఫ్రా, బోవర్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక హైదరాబాద్‌ ఎకనామిక్‌ ఫోరం 2026 సదస్సులో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో భూగర్భ సొరంగ మార్గాల ద్వారా వివిధ ఐటీ కంపెనీలు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగుల రాకపోకలను సులభతరం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ టన్నెల్ రోడ్ల ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే నగరంలో ట్రాఫిక్ రహిత సుఖవంతమైన ప్రయాణం సాధ్యమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.సమకాలీన సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను అందుపుచ్చుకుంటూ.. టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ భాగస్వామ్యంతో క్వాంటం కంప్యూటింగ్‌ కోసం నగరంలో ఒక ప్రతిష్ఠాత్మక సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. నూతన ఆలోచనలను సరికొత్త ఆవిష్కరణలుగా, ఆచరణలో పెట్టే అంతర్జాతీయ కేంద్రంగా హైదరాబాద్ మారిందని దీనికి ప్రభుత్వ ఆధ్వర్యంలోని టీ-హబ్, టీ-వర్క్స్ బలమైన దన్నుగా నిలుస్తున్నాయని ప్రశంసించారు. దీనికి అద్దం పడుతూ.. నగరానికి చెందిన ఒక ప్రముఖ స్టార్టప్ సంస్థ త్వరలోనే అంతరిక్షంలోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాబొరేటరీని పంపనుండటం గర్వకారణమన్నారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో భారతదేశానికే హైదరాబాద్‌ను అత్యున్నత ఇన్నోవేషన్ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా డేటా ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫాంను పరిచయం చేసిన ఘనత తెలంగాణ రాష్ట్రానికే దక్కిందన్నారు. అంతర్జాతీయంగా తీవ్ర పోటీ ఉన్నప్పటికీ, గత ఏడాది రికార్డు స్థాయిలో 70 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను రాష్ట్రానికి తీసుకువచ్చామని ఈ ఏడాది మరో 100 జీసీసీలను తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు.రాబోయే దశాబ్దాల భవిష్యత్తు అవసరాలకు బలమైన పునాదులు వేస్తూ భారత్ పరిధిలో నిర్మించబోయే ఏఐ సిటీ కోసం ప్రభుత్వం ఇప్పటికే 200 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని మంత్రి తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం, లైఫ్ సైన్సెస్ సమ్మిళితానికి హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే అత్యంత అనుకూలమైన ప్రాంతమని ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న వ్యాక్సిన్లలో దాదాపు మూడో వంతు వ్యాక్సిన్లు ఇక్కడి నుంచే ఎగుమతి అవుతున్నాయని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ భూగర్భ టన్నెల్ రోడ్ల ప్రతిపాదన నగర రవాణా రంగంలో ఒక మైలురాయిగా నిలవనుందని మౌలిక వసతుల నిపుణులు భావిస్తున్నారు.