ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన నెలరోజులు కూడా కావడం లేదు. కానీ అప్పుడే ఐపీఎల్ 2027 గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ జట్టు కెప్టెన్‌ను మారుస్తుంది, ఫలానా ఆటగాడిని ఇంకో జట్టు ట్రేడ్ చేసుకుంటుంది.. అనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఓ భారీ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచిన .. లక్నో సూపర్ జెయింట్స్‌ను వీడనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026లో పేలవ ప్రదర్శన తర్వాత పంత్.. తాజాగా టీమ్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.రిషభ్ పంత్.. ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు తిరిగి తన పాత ఫ్రాంఛైజీ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ గూటికి చేరనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ట్రేడ్ కోసం.. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య చర్చలు జరుగుతున్నాయట. ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు జరిగిన వేలంలో లక్నో సూపర్ జెయింట్స్.. పంత్‌ను రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లకు దక్కించుకుంది. వచ్చీరాగానే సారథ్య బాధ్యతలు అప్పగించింది. కానీ పంత్ అంచనాలు అందుకోలేకపోయాడు. ఆటగాడిగా, సారథిగా విఫలమయ్యాడు. దీంతో రెండు సీజన్లలో లక్నో ప్లే ఆఫ్స్ చేరలేకపోయింది.దానికి తోడు భారీ ప్రైజ్ ట్యాగ్ కూడా.. అతడిపై ఒత్తిడికి కారణం అవుతోందనే విశ్లేషణలు ఉన్నాయి. దీంతో అతడు తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్‌కే చేరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రూ. 27 కోట్లకు కాకుండా.. తన ప్రైజ్‌ను తగ్గించుకునేందుకు కూడా పంత్ అంగీకరించాడట. రూ. 15 కోట్లతో డీసీకి చేరేందుకు అతడు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.రిషభ్ పంత్.. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 2016 నుంచి 2024 వరకు ఆడాడు. 111 మ్యాచులలో ప్రాతినిధ్యం వహించాడు. కానీ 2024 సీజన్ తర్వాత డీసీ మేనేజ్‌మెంట్‌తో విబేధాల కారణంగా జట్టును వీడాలని నిర్ణయించుకున్నాడు. పంత్ డీసీ తరఫున 43 మ్యాచ్‌లలో కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. పంత్.. తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరే అంశంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.