ఏపీలో గడ్డి మందును అమ్ముకోవడానికి అనుమతివ్వండి.. హైకోర్టులో పిటిషన్‌, ఇదేం ట్విస్ట్!

Wait 5 sec.

తెలుగు రాష్ట్రాల్లో కొద్దిరోజులుగా బాగా వినిపిస్తున్నపేరు పారాక్వాట్‌ డైక్లోరైడ్‌ 24% ఎస్‌ఎల్‌. ఈ గడ్డి మందు చాలా డేంజర్ అంటూ ఫిర్యాదులు రావడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే ఆసక్తికరంగా ఈ గడ్డి మందును నిషేధించడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ ఏడాది మే 22న పారాక్వాట్‌ డైక్లోరైడ్‌ 24% ఎస్‌ఎల్‌ గడ్డి మందుతో పాటుగా దాని సంబంధ ఉత్పత్తుల తయారీ, విక్రయాన్ని రెండు నెలల పాటూ నిషేధిస్తూ వ్యవసాయశాఖ జారీ జీవో జారీ చేసింది. అలాగే మరో నోటిఫికేషన్‌ను కూడా ఇచ్చారు. ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్స్‌ డీలర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకట నాగిరెడ్డి ఈ జీవోతో పాటుగా నోటిఫికేషన్‌ను హైకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. పారాక్వాట్‌ తయారీ, పంపిణీ, విక్రయానికి అనుమతిచ్చేలా ఆదేశించాలని పిటిషన్‌లో నాగిరెడ్డి ఏపీ హైకోర్టును కోరారు. ఈ గడ్డి మందు అత్యంత విషపూరితమని.. రైతులతో పాటుగా మరికొందరు తాగి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని.. దీన్ని నిషేధించాలంటూ డీజీపీ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. డీజీపీ రాసిన లేఖ, ఇతర నివేదికలతో ప్రభుత్వం ముందుగా తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నిషేధం విధించిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్స్‌ డీలర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌పై ప్రభావం పడిందన్నారు. వ్యవసాయంలో పురుగుల మందు ఉపయోగించిన సమయంలో దానివల్ల ప్రమాదం ఉంటేనే నిషేధించేందుకు వీలుంటుందని కీటకనాశన చట్ట నిబంధనలు ఉన్నాయని గుర్తు చేశారు. కేవలం ఆత్మహత్యలను కారణంగా చూపి నిషేధించడం సరికాదన్నారు. తాము అభ్యంతరాలు చెప్పుకోవడానికి అవకాశం కూడా ఇవ్వకుండా నిషేధించారని కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్‌లో వ్యవసాయ, వైద్య ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ, డీజీపీని ప్రతివాదులుగా చేర్చారు. విధించింది. ఈ గడ్డి మందు ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పుగా మారిందని అందుకే అన్ని రూపాల్లో నిషేధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిషేధాన్ని తయారీదారులు, పంపిణీదారులు, డీలర్లు, రిటెయిలర్లు, వినియోగదారులు అమలు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో వ్యవసాయశాఖ, జిల్లాల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.. కేంద్రం కూడా ఈ గడ్డి మందు దుష్ప్రభావాల్ని పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ గడ్డి మందు కారణంగా కిడ్నీలు, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయని, మెదడులో నాడీ వ్యవస్థన దెబ్బతినే ప్రమాదం ఉందని పరిశోధనల్లో తేలిందని చెబుతున్నారు. అలాగే ఈ గడ్డి మందు తాగిన వారు వెంటనే చనిపోతున్నారని కూడా ఫిర్యాదులు ఉన్నాయి.