బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం.. ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు

Wait 5 sec.

తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉంది. ఈ ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడొచ్చని అలర్ట్ చేశారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఎండ ప్రభావం కూడా ఉంటుందన్నారు. వర్షాలు పడే సమయంలో ఉరుములు, మెరుపులు ప్రభావం ఉంటుందని.. ఆ సమయంలో చెట్ల కింద, పోల్స్ దగ్గర నిలబడొద్దని హెచ్చరించారు. పొలాల్లో పనిచేస్తున్న రైతులు, కూలీలు, పశువుల కాపరులు మరింత అప్రమత్తంగా ఉండి, వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడ్డాయి. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కూడా వానలు కురిశాయి. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు అనంతపురం జిల్లా సిద్దరాంపురంలో అత్యధికంగా 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో 3.6సెం.మీ, కడప జిల్లా చౌడూరులో 3 సెం.మీ, శ్రీకాకుళం జిల్లా మేలియపుట్టిలో 3 సెం.మీ వర్షపాతం నమోదైంది.మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వానలు తప్ప రుతుపవనాల ప్రభావం కనిపించడం లేదు. ప్రస్తుతం ద్రోణి ప్రభావంతో వానలు పడుతుండగా.. రుతుపవనాలు వచ్చి 10 రోజులు దాటినా సరే ప్రభావం కనిపించడం లేదు. రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. వర్షాలు పడతాయని చాలామంది రైతులు దుక్కులు దున్ని విత్తనాలు కూడా సిద్ధం చేసుకున్నారు. కానీ రుతుపవనాల జాడ కనిపించడం లేదని ఆవేనద వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరోసారి దుక్కులు దున్నాల్సిన పరిస్థితి ఉంటుదంటున్నారు. రుతుపవనాల ప్రభావంతో వర్షాలు ఊపందుకుంటే కానీ రైతులు వ్యసాయ పనులు ముమ్మరం చేయలేరు.