తెలంగాణలో నేడు వర్షాలు కురుస్తాయా..? వాతావరణశాఖ కీలక అప్డేట్

Wait 5 sec.

దాదాపు జూన్ నెల కూడా పూర్తి కావొస్తుంది. కానీ ఇప్పటి వరకు తెలంగాణలో సరైన వర్షాలు లేవు. గతేడాది మే 26నే నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకగా.. ఈసారి మాత్రం చాలా ఆలస్యంగా జూన్ 8న రాష్ట్రంలోకి ప్రవేశించాయి. అయినా పవనాల గమనం మందకొడిగా ఉండటంతో ఇప్పటి వరకు విస్తారంగా వర్షాలు కురిసిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో నేటి వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. నేడు, మధ్య, దక్షిణ తెలంగాణ ప్రాంతాలకు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. ఈ రోజు సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ముఖ్యంగా రాత్రి వేళల్లో సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, నల్గొండ, యాదాద్రి-భువనగిరి, జనగాం, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా తీవ్రమైన ఉరుములతో కూడిన జల్లులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. భాగ్యనగరం హైదరాబాద్‌లో కూడా రాత్రి వేళల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు, వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ వర్షాలు గత కొన్ని రోజులుగా అల్లాడిపోతున్న ప్రజలకు కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉంది.మరోవైపు.. రాష్ట్రంలో అసాధారణంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో తెలంగాణ ఉడికిపోతోంది. ఎండ తీవ్రతకు తోడు ఉక్కపోత కూడా తోడవడంతో ప్రజలు నరకం చూస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భగభగలు మరింతగా పెరిగాయి. శుక్రవారం రాష్ట్రంలోని 17 జిల్లాల పరిధిలోని 59 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీచాయి. పలుచోట్ల సాధారణ ఉష్ణోగ్రత కన్నా 6 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా రామగుండంలో సాధారణంగా 34.9 డిగ్రీల సెల్సియస్‌ నమోదు కావాల్సి ఉండగా.. ఏకంగా 7 డిగ్రీలు పెరిగి 41.9 డిగ్రీలు నమోదయింది. నిజామాబాద్‌లో 7 డిగ్రీలు పెరిగి 41.3 డిగ్రీలు, మెదక్‌లో 6.6 డిగ్రీలు పెరిగి 40 డిగ్రీలు, హనుమకొండలో 6.6 డిగ్రీలు పెరిగి 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.రాష్ట్రంలోని మరో 116 మండలాల్లో కూడా సాధారణ వడగాలులు వీచాయి. అత్యధికంగా మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల్లో పదేసి మండలాలు, పెద్దపల్లిలో 9, హైదరాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 8 మండలాల్లో వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉంది. మహబూబ్‌నగర్‌లో సాధారణం కన్నా 5.3 డిగ్రీలు, ఖమ్మంలో 4.5 డిగ్రీలు, హైదరాబాద్‌లో 4.2 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఈ మేరకు ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాలకు నేడు, రేపు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎండల తీవ్రత ఉన్నప్పటికీ కొన్ని జిల్లాల్లో స్థానిక వాతావరణ మార్పుల వల్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు స్పష్టం చేసింది. నైరుతి రుతుపవనాలు ఊపందుకుంటే తప్ప రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.