ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితను ఉద్దేశించి వైసీపీ నేత, మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలను కూటమి పార్టీలు తప్పుబడుతుండగా.. వైసీపీ శ్రేణులు, నాయకులు గుడివాడ అమర్నాథ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి .. గతంలో రోజా గురించి చేసిన వ్యాఖ్యలను తెరపైకి తెచ్చారు. ఓ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ రోజాను డైమండ్ రాణి అని సంభోధించిన వీడియోను చూపిస్తూ డిప్యూటీ సీఎంపై విమర్శలు గుప్పించారు. సంస్కారానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారినట్లు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారన్న పేర్ని నాని.. పవన్ కళ్యాణ్‌కు కొత్తగా మంత్రి పదవితో పాటుగా సంస్కారం కూడా వచ్చిందా అని ప్రశ్నించారు. గతంలో పవన్ కళ్యాణ్ కొడకల్లారా.. రండిరా అంటూ చేసిన వైసీపీ నేతల గురించి మాట్లాడిన వీడియోలను విలేకర్ల సమావేశంలో ప్రదర్శించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడింది సంస్కారవంతమైన భాషా అని పేర్ని నాని ప్రశ్నించారు. పార్టీ పెట్టిందే సుగాలి ప్రీతి కోసమని చెప్పిన పవన్ కళ్యాణ్.. ఆ విషయాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని విమర్శించారు. కట్టుబొట్టూ గురించి గుడివాడ అమర్నాథ్ మాట్లాడలేదన్న పేర్ని నాని.. మేకప్ గురించి మాట్లాడితే ఏపీలోని మొత్తం స్త్రీల గురించి అన్నట్లు స్టేట్మెంట్లు ఇస్తున్నారని అన్నారు. హోం మంత్రి అనిత నోరుపారేసుకోవటంతోనే అమర్నాథ్ బదులిచ్చారని క్లారిటీ ఇచ్చారు.గుడివాడ అమర్ నాథ్ ఏమీ అనకుండానే పవన్ కళ్యాణ్ కట్టూ బొట్టు ప్రస్తావన తీసుకువచ్చారని ఆరోపించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జనసైనికుల బాధలు కనబడవు, వినపడవన్న పేర్ని నాని.. తెలంగాణలోని అభిమాని మాత్రం కనిపిస్తారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ భార్యాపిల్లల గురించి నారా లోకేష్ విలేకర్ల సమావేశంలో ప్రస్తావిస్తారని.. వారు ఏనాడైనా రాజకీయాల గురించి, వీరి గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు. నారా లోకేష్ తల్లి గారు ఒక్కరే స్ర్తీ.. మిగతా వారు కాదా అని పేర్ని నాని ప్రశ్నించారు. మరోవైపు ఏపీ పోలీసుల తీరు దారుణంగా ఉందన్న పేర్ని నాని.. విజయవాడలో శాంతిభద్రతలను గాలికొదిలేశారని ఆరోపించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని గాదె సాయికృష్ణ కేసును సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలని పేర్ని నాని డిమాండ్ చేశారు.