హైడ్రా చట్టానికి అతీతం కాదు.. ప్రైవేటు ఆస్తిలోకి వెళ్లినందుకు కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు సీరియస్

Wait 5 sec.

ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు కబ్జాకు గురి కాకుండా.. ఇప్పటికే ఆక్రమించిన వాటిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాకు కొన్నిసార్లు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కొన్ని భూములు ప్రభుత్వానికి సంబంధించినవే అని నిరూపించడంలో అధికారులు విఫలం కావడం వల్ల.. అలాంటి భూముల్లోకి వెళ్లినపుడు.. కొన్నిసార్లు హైకోర్టు మొట్టికాయలు వేస్తోంది. తాజాగా మరో ఘటనలో హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భూములకు రక్షణ కల్పిస్తూ తాము ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. ప్రైవేటు ఆస్తిలో ప్రవేశించినందుకు తీరుపై కోర్టు ఆగ్రహించింది. రంగారెడ్డి జిల్లా మల్కాజిగిరి మండలం లోతుకుంట ప్రాంతంలోని సర్వే నంబర్‌ 1, 2 లో ఉన్న భూమికి సంబంధించిన యజమాన్య స్వాధీన హక్కులను రక్షిస్తూ తాము ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినా.. ప్రైవేట్ ఆస్తిలోకి వెళ్లినందుకు హైడ్రా కమిషనర్‌ తీరుపై హైకోర్టు మండిపడింది. హైకోర్టు ఉత్తర్వులను హైడ్రా బహిరంగంగా ఉల్లంఘించిందని.. హైడ్రా ప్రత్యేక విభాగంగా భావిస్తున్నట్లు కనిపిస్తోందని తీవ్రంగా వ్యాఖ్యానించింది. కానీ హైడ్రా కూడా చట్టానికి అతీతులు కాదని.. పరిపాలనా వ్యవస్థలో ఒక భాగమేనని కోర్టు స్పష్టం చేసింది. చట్టపరిధిని దాటి వ్యవహరించే అధికారం హైడ్రా అధికారులకు లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఇక నుంచి ఆ భూమిలోకి ప్రవేశించబోమని హైడ్రా తరఫు లాయర్ కోర్టుకు హామీ ఇవ్వడంతో.. దాన్ని ఉల్లంఘించొద్దంటూ.. కోర్టు హైడ్రా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఆ భూమి యజమాని హైడ్రాపై దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ముగించింది.లోతుకుంట గ్రామ పరిధిలోని భూమికి సంబంధించిన విషయంలో శాంతా శ్రీరామ్‌ అనే నిర్మాణ సంస్థ దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఆ భూ వివాదానికి సంబంధించి.. రిట్‌ అప్పీల్, సివిల్‌ సూట్, ఫస్ట్‌ అప్పీల్‌ వంటి కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రాకపోయినా.. ఆ భూమిలోకి హైడ్రా అధికారులు ప్రవేశించి, జోక్యం చేసుకున్నారని పిటిషనర్ ఆరోపించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ జూకంటి అనిల్‌కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌పై స్పందించిన హైడ్రా లాయర్.. సొసైటీ టు సేవ్‌ రాక్స్‌ నుంచి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా హైడ్రా అధికారులు ఆ స్థలాన్ని సందర్శించినట్లు వివరణ ఇచ్చారు. ఈ పిటిషన్‌పై వాదనలు విన్న జడ్జి.. ఆ భూమి తమదేనని నిరూపించడంలో ప్రభుత్వం విఫలం అయిందని తెలిపారు. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ భూమిపై ఎలాంటి హక్కు లేదని.. హైడ్రా అధికారులు ప్రైవేట్‌ భూమిలోకి ప్రవేశించడం న్యాయపరంగా సరైంది కాదని తేల్చి చెప్పారు. హైడ్రా ఏర్పాటు ఉత్తర్వులను పరిశీలించిన హైకోర్టు జడ్జి.. రోడ్లు, కాలువలు, చెరువులు, పార్కులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకే హైడ్రా పరిమితమని తేల్చిచెప్పారు.