అఫ్ఘానిస్థాన్‌తో వన్డే సిరీస్‌ను టీమిండియా క్లీన్‌ స్వీప్ చేసింది. శనివారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో భారత్.. 9 వికెట్ల తేడాతో జయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అప్ఘానిస్థాన్.. 44.2 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం జైశ్వాల్ అజేయ సెంచరీతో భారత్.. 28.4 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అప్ఘాన్ కెప్టెన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ వేయడం.. అఫ్ఘాన్ బ్యాటర్లు షాట్లు కొట్టడం.. బంతి వెళ్లి నేరుగా రోహిత్ శర్మ చేతిలో పడటం. వరుసగా మూడు వికెట్లు ఇదే తరహాలో పడ్డాయి. రెహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రెహ్మత్ షా.. ముగ్గురు ప్రసిద్ధ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్‌ ఇచ్చి ఔట్ అయ్యారు. డార్విష్ రసూల్ కూడా ఔట్ కావడంతో అఫ్ఘాన్.. 36/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ (102), అజ్మతుల్లా ఒమర్జాయ్ (50) ఆదుకున్నారు. కానీ వారిద్దరూ ఔట్ అయ్యాక అఫ్ఘాన్ కుప్పకూలింది. ప్రసిద్ధ్ కృష్ణ ఐదు వికెట్లు తీశాడు.అనంతరం ఛేజింగ్ ప్రారంభించిన భారత ఓపెనర్లు అఫ్ఘాన్ బౌలర్లు ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. ఈ క్రమంలోనే రోహిత్, జైశ్వాల్.. ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 69 బంతుల్లో 79 రన్స్ చేసి రోహిత్ శర్మ ఔట్ అయినా.. జైశ్వాల్ మాత్రం జోరు కొనసాగించాడు. ఈ క్రమంలోనే తన కెరీర్‌లో రెండో వన్డే సెంచరీ కొట్టాడు. సిక్సర్‌తో మ్యాచ్ ముగించాడు. 86 బంతుల్లో 110 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ 19 బంతుల్లో 20 రన్స్ చేసి నాటౌట్‌గా ఉన్నాడు.ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ 3-0తో విజేతగా నిలిచింది. అప్ఘానిస్థాన్.. ఒక టెస్ట్, మూడు వన్డేలు ఆడేందుకు భారత్‌లో అడుగుపెట్టింది. కానీ అన్నింట్లోనూ ఓడిపోయి.. నిరాశగా వెనుదిరుగుతోంది.