"నేను హోం మంత్రిని కాదు.. అది క్రిమినల్స్ అదృష్టం": పవన్ కళ్యాణ్

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో హోం మంత్రిత్వశాఖ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు పవన్ కళ్యాణ్. తాను హోం మినిస్టర్ కాదని.. హోం శాఖ తన పరిధిలోకి రాదని.. అది క్రిమినల్స్ అదృష్టమన్నారు పవన్ కళ్యాణ్. కాకినాడలో జరిగిన మన ఊరు- మాటామంతీ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. కీలక వ్యాఖ్యలు చేశారు. నేరస్థులకు కులాలు అంటగట్టవద్దన్న పవన్ కళ్యాణ్.. కులం దరిద్రం వదిలేతే తప్ప ఏపీ బాగుపడదన్నారు. నేరస్థులు రాజ్యాంగపరమైన పదవుల్లో కూర్చుని శాసిస్తామంటే జీవితాంతం పోరాడతామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే తనను ఓ కులానికి పరిమితం చేయవద్దని పవన్ కళ్యాణ్ కోరారు. ఎవడో క్రిమినల్ తప్పు చేస్తే దానికి తాను బాధ్యత వహించాలా అని ప్రశ్నించారు. 14 ఏళ్ల ఆడబిడ్డను రేప్ చేసిన వాడిని తాను వెనకేసుకుని రావాలా.. సిగ్గుండక్కర్లేదా అని మండిపడ్డారు. ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్‌ను చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు కులాలు రావని.. ఓ రౌడీ చనిపోతే, ఆ విషయంలోకి తనను లాగుతారా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉండి ఎవరూ నోరు తెరవకపోతే ఎలా.. ఏం చేస్తున్నారు మీరంతా, మీకు పౌరుషం లేదా.. నేను రోజూ రావాలా అని మండిపడ్డారు. ఇది తనకు చాలా ఇబ్బందిగా ఉందంటూ అసహనం వ్యక్తం చేశారు.ప్రభుత్వాలు రావటం, పోవటం ప్రజల చేతుల్లో ఉందన్న పవన్ కళ్యాణ్.. వచ్చినప్పుడు భయపడిపోవటం ఉండకూడదన్నారు. ఇంకా మూడేళ్లు మిగిలి ఉందని.. మూడేళ్లలో చర్యలు ఎలా ఉంటాయో తాను చూపిస్తానన్నారు. లా అండ్ ఆర్డర్ తనది కాదని ఇప్పటి వరకూ మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నానన్న పవన్ కళ్యాణ్.. ఇకపై తన అభిప్రాయాలను ప్రజలతోనే పంచుకుంటానని స్పష్టం చేశారు. కులాలు, మతాల కోసం వాట్సాప్ గ్రూపులు ఉంటాయని.. లా అండ్ ఆర్డర్ కోసం, స్థానిక సమస్యల పరిష్కారం కోసం వాట్సాప్ గ్రూపులు ఎందుకు ఉండకూడదన్నారు పవన్ కళ్యాణ్. ఆ దిశగా అందరూ ఆలోచించాలని కోరారు.