రైతులకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరి అకౌంట్లో రూ. 2 వేలు పడ్డాయ్.. మీకు రాలేదా కారణమిదే!

Wait 5 sec.

: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ 23వ విడత నిధులు విడుదలయ్యాయి. పశ్చిమ్ బెంగాల్ హూగ్లీలోని తారకేశ్వర్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధుల్ని విడుదల చేశారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) విధానంలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే డబ్బులు జమయ్యాయి. మొత్తంగా 9.44 కోట్ల మందికిపైగా లబ్ధిదారుల అకౌంట్లలో రూ. 18,880 కోట్లు పడ్డాయి. ఒక్కో రైతు ఖాతాలో రూ. 2 వేలు జమయ్యాయి. 2025-26 డిసెంబర్- మార్చి కాలంలో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 9,46,15,309 గా ఉంది. అంటే 9.46 కోట్ల మంది లబ్ధిదారులు ఉండగా ఈసారి ఆ సంఖ్య 2 లక్షలకుపైగా తగ్గిందని చెప్పొచ్చు. ఈ స్కీమ్ విషయానికి వస్తే ఏటా రూ. 6 వేల మొత్తం ఒకేసారి జమ చేయరు. ప్రతి 4 నెలలకు ఓసారి 3 విడతల్లో రూ. 2 వేల చొప్పున రైతుల అకౌంట్లలో జమ చేస్తారు. ఇప్పటివరకు 22 విడతల్లో డబ్బులు రాగా.. జూన్ 20న 23వ విడత డబ్బులు పడ్డాయని చెప్పొచ్చు. 2019లో ఈ స్కీమ్ ప్రారంభమైంది. పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాను పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అక్కడ లబ్ధిదారుల లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే ఫార్మర్స్ కార్నర్‌లో బెనిఫిషియరీ లిస్ట్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అక్కడ రాష్ట్రం, జిల్లా, బ్లాక్, విలేజ్‌ను ఎంచుకొని గెట్ రిపోర్ట్ మీద క్లిక్ చేయాలి. అక్కడ లబ్ధిదారుల్లో మీరు ఉన్నారో లేదో కనిపిస్తుంది. అయితే కొందరు లబ్ధిదారులకు పీఎం కిసాన్ డబ్బులు పడలేదు. ఇక్కడ చాలానే కారణాలు ఉండొచ్చు. కొన్ని అనుమానాస్పద కేసుల్లో కొందరు రైతుల్ని లబ్దిదారుల జాబితా నుంచి తొలగించొచ్చు. వీటిల్లో 2019, ఫిబ్రవరి 1 తర్వాత భూమి కొనుగోలు చేసినవారికి ఈ స్కీమ్ వర్తించదు. ఒక కుటుంబంలో ఒకరికి మించి (భార్యాభర్తలు, తండ్రీకొడుకులు) ఇలా లబ్ధి పొందతున్నట్లయితే వారిని కూడా తాత్కాలికంగా తొలగిస్తారు. భౌతిక ధ్రువీకరణ ద్వారా ఇక్కడ ప్రయోజనం పొందాలా లేదా అనే నిర్ణయం తీసుకుంటారు. మరోవైపు పీఎం కిసాన్ ప్రయోజనాలు పొందాలంటే ఇ- కేవైసీ కూడా తప్పనిసరి. ఇది లేకుంటే డబ్బులు రావని చెప్పొచ్చు. దీనిని 3 రకాలుగా చేసుకోవచ్చు. పీఎం కిసాన్ పోర్టల్‌లో ఓటీపీ బేస్ట్ కేవైసీ చేసుకోవచ్చు. కామన్ సర్వీస్ సెంటర్లలో బయోమెట్రిక్ బేస్డ్ కేవైసీ పూర్తి చేయొచ్చు. పీఎం కిసాన్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ కేవైసీ చేయొచ్చు.