(ఏఐ).. ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతీ మూలకు చేరుకుంటోంది. ఈ ఏఐ, రోబోలతో వేల సంఖ్యలో ఉద్యోగాలు పోతున్నాయి. అయితే బెంగళూరులోని మార్కెట్‌లో పనిచేసే కార్మికులే.. తమ పనులను భవిష్యత్తులో భర్తీ చేసే ఏఐ ఆధారిత హ్యూమనాయిడ్ రోబోలకు శిక్షణ ఇస్తున్న సంఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బెంగళూరులోని న్యూ తిప్పసంద్ర మార్కెట్‌లో కార్మికులు, వ్యాపారులు తమ తలకు కెమెరాలు పెట్టుకుని.. రోజువారిగా వారు చేస్తున్న పనులను రికార్డ్ చేస్తున్నారు. అమెరికాకు చెందిన ఇన్‌స్టావర్క్ సంస్థ ఈ వీడియోలను సేకరించి హ్యూమనాయిడ్ ఏఐ రోబోలకు ట్రైనింగ్ ఇస్తోంది. బట్టలు మడవడం, వస్తువులను గుర్తించడం వంటి పనులను ఏఐ రోబోలకు ట్రైనింగ్ ఇచ్చేందుకు ఈ డేటాను ఉపయోగించనున్నారు. అయితే.. రానున్న రోజుల్లో ఈ రోబోలు వారి ఉద్యోగాలనే భర్తీ చేసి.. తమకు ఉపాధి లేకుండా చేసే అవకాశం ఉందన్న ఆందోళన ఇప్పుడు ఆ కార్మికుల్లో వ్యక్తం అవుతోంది. న్యూ తిప్పసంద్ర మార్కెట్‌లో కిరాణా దుకాణం యజమాని నాగరాజ్.. ప్రతిరోజులాగే సరుకులు సర్దడం, కస్టమర్లు అడిగిన వస్తువులు విక్రయించడం, డబ్బులు తీసుకోవడం వంటి పనులను.. తన తలకు ప్రత్యేక హెడ్‌బ్యాండ్‌కు అమర్చిన కెమెరాను ధరించి చేస్తున్నారు.తలకు పెట్టుకున్న ఆ కెమెరా ద్వారా ఆయన చేసే ప్రతి కదలిక, చేతుల కదలికలు, కస్టమర్లతో వ్యవహరించే విధానం మొత్తం అందులో రికార్డ్ అవుతోంది. ఆ వీడియోలను ఏఐ వ్యవస్థలకు ట్రైనింగ్ ఇచ్చేందుకు ఉపయోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. మనుషులు ఎలా పని చేస్తారో రోబో నేర్చుకునేందుకు ఈ కెమెరాలు ఇచ్చారని.. తాను తన రోజువారీ పనులు చేస్తూ కెమెరా ధరించడమే తన పని అని నాగరాజ్ వెల్లడించారు.తూర్పు బెంగళూరులోని న్యూ తిప్పసంద్ర మార్కెట్ సాధారణంగా కూరగాయల వ్యాపారులు, టైలర్లు, వస్త్ర దుకాణాలు, చిన్న వ్యాపారులతో కిటకిటలాడే ప్రాంతంగా ఉంది. అయితే ఈ ఏడాది మే నెలలోనే ఇన్‌స్టావర్క్ ప్రతినిధులు అక్కడికి వెళ్లి కార్మికుల ముందు ఒక ప్రతిపాదన ఉంచారు. వారు చేసే సాధారణ పనులను కెమెరాలు ధరించి చేయాలని.. అందుకు తాము డబ్బులు చెల్లిస్తామని సూచించారు. ఇన్‌స్టావర్క్ కంపెనీ ప్రతినిధులు.. కేవలం వివరాలు చెప్పి, హెడ్‌బ్యాండ్‌కు అమర్చిన ఐఫోన్లు, ఛార్జర్లను అందించారని.. అయితే ఎలాంటి ఒప్పంద పత్రాలపై సంతకాలు తీసుకోలేదని.. మొత్తం వ్యవహారం మాటలపైనే సాగిందని కార్మికులు చెబుతున్నారు.2015లో స్థాపించిన అమెరికాకు చెందిన ఇన్‌స్టావర్క్ సంస్థ తొలుత తాత్కాలిక ఉద్యోగాల కోసం ఏర్పాటైన డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌గా ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 70 లక్షలకుపైగా కార్మికులు ఈ సంస్థ నెట్‌వర్క్‌లో పనిచేస్తున్నారు. భారత్‌లో ఈ సంస్థ కార్యాలయం బెంగళూరులోని కోరమంగళలో ఉంది. ఆ సంస్థ చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌ను ఈగోసెంట్రిక్ డేటా క్యాప్చర్‌గా పిలుస్తారు. అంటే కెమెరా ధరించిన వ్యక్తి ద్వారా వీడియోలు రికార్డ్ చేయడం. ఈ ప్రాజెక్టు భారత్‌లోని పలు నగరాల్లో 3 నెలల పాటు కొనసాగుతోందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. సేకరించిన వీడియోలను హ్యూమనాయిడ్ రోబోలు.. ఆ పనులను ఎలా పని చేయాలో నేర్పేందుకు ఉపయోగించనున్నారు.బట్టలను మడవడం.. టమాటాలను నలగకుండా ఎత్తడం.. షెల్ఫ్‌లో ఉన్న వస్తువును గుర్తించడం వంటి పనులను రోబోలు చేయాలంటే మనుషుల కళ్లూ, చేతులు ఎలా పనిచేస్తున్నాయో అవి నేర్చుకోవాల్సి ఉంటుంది. అందుకే వారు ఇలాంటి పనులను కెమెరాలో రికార్డ్ చేసి.. రోబోలకు ట్రైనింగ్ ఇస్తుంది. ఇందుకోసం లక్షల గంటలపాటు మనుషులు చేసే పనుల వీడియో డేటా అవసరమని.. అలాంటి డేటాను కృత్రిమంగా సృష్టించడం కష్టం అవుతుండటంతో.. నిజ జీవితంలో పనిచేసే కార్మికుల నుంచి నేరుగా సేకరిస్తున్నారు.ఈ ప్రాజెక్టు గురించి ఆ సంస్థ ప్రతినిధులు కార్మికులకు కేవలం సాధారణ వివరాలు మాత్రమే తెలియజేసినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఏఐ వ్యవస్థలు, రోబోలు మనుషుల కదలికల నుంచి నేర్చుకుని ప్రస్తుతం వారు చేస్తున్న పనులను కూడా చేయగలవని కంపెనీ ప్రతినిధులు చెప్పినట్లు పలువురు కార్మికులు వెల్లడించారు. దీంతో తమ పనులను నేర్పుతున్న రోబోలు.. భవిష్యత్‌లో ఒకరోజు తమ ఉద్యోగాలను భర్తీ చేస్తాయా అనే ప్రశ్నలు కార్మికుల్లో సాంకేతిక నిపుణుల్లో చర్చకు దారితీశాయి.