మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ బోణీ కొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన తమ తొలి మ్యాచులో 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 170/6 పరుగులు చేసింది. అనంతరం పాకిస్థాన్‌ను 17 ఓవర్లలో 106 పరుగులకు కుప్పకూల్చింది. దీంతో పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. గ్రూప్-ఏ పాయింట్స్ టేబుల్‌లో ప్రస్తుతం ఆస్ట్రేలియా +3.250 నెట్ రన్ రేట్‌, 2 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. భారత్.. +3.200 నెట్ రన్ రేట్, 2 పాయింట్లతో రెండో ప్లేసులో ఉంది.ఇంగ్లాండ్‌లోని బర్మింగ్ హామ్‌లో జరిగిన ఈ మ్యాచులో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 170/6 పరుగులు స్కోరు చేసింది. ఓ దశలో 18 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన హర్మన్ ప్రీత్ టీమ్.. ఆత్మరక్షణలో పడింది. ఈ సమయంలో వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (44 బంతుల్లో 68 రన్స్), రాణించారు. చివర్లో రిచా ఘోష్.. 17 బంతుల్లో 34 రన్స్ చేయడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. పాక్ బౌలర్లలో కెప్టెన్ ఫాతిమా సనా 2, సాదియా ఇక్బాల్ రెండు వికెట్లు తీశారు. తస్మియా రుబాబ్, రమీన్ షామిమ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.అనంతరం ఛేజింగ్ ప్రారంభించిన పాకిస్థాన్.. ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. భారత బౌలర్ల దెబ్బకు పాక్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ముఖ్యంగా దీప్తి శర్మ, శ్రీ చరణి.. దాయాది జట్టును దెబ్బ కొట్టారు. 4 ఓవర్లు వేసి 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసింది. శ్రీ చరణి 4 ఓవర్లలో 21 రన్స్ ఇచ్చి.. 3 వికెట్లు పడగొట్టింది. షెఫారీ వర్మ ఖాతాలో ఒక వికెట్ పడింది. దీంతో పాక్.. 17 ఓవర్లలో 106 పరుగులకు కుప్పకూలింది.ఈ ఫలితంతో భారత్.. టీ20 ప్రపంచకప్ 2026ను విజయంతో ఆరంభించింది. భారత్ తన తర్వాతి మ్యాచులో జూన్ 17న నెదర్లాండ్స్‌తో తలపడనుంది.