కష్ట సుఖాలలో కడదాకా తోడుంటానని చేసిన బాసలు.. నీటి మీద రాతలయ్యాయి. ఏడు జన్మలూ తోడుంటానంటూ వేసిన ఏడు అడుగులు మూడేళ్ల ముచ్చటయ్యాయి. ధర్మార్థ కామాలలో నిను వదలి నేనుండను అంటూ కన్యాదానం సమయంలో పలికిన నాతిచరామి పలుకులను విధి ప్రశ్నార్థకం చేసింది. ఇన్ని ప్రతికూలతల మధ్యన భార్య భవిష్యత్తు కోసం ఆ భర్త తీసుకున్న నిర్ణయం.. ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చేలా చేస్తోంది. తాను కష్టపడినా ఫర్వాలేదు.. తనను నమ్మి వచ్చిన ఇల్లాలి జీవితం తన కారణంగా నాశనం కాకూడదన్న అతని త్యాగం.. కన్యాదానానికే కొత్త అర్థం చెప్తోంది. అనకాపల్లి జిల్లా టి. సరసపల్లిలోని గోవింద్ కథ.. చిన్నపాటి కష్టాన్ని కూడా భరించలేని నేటి యువతకు.. భార్యభర్తల బంధాన్ని అర్థం చేసుకోలేకపోతున్న యువ జంటలకు ఓ స్ఫూర్తి. ఆయన త్యాగం, పట్టుదల.. ఎంతోమందికి ఆదర్శం.గోవింద్. శ్రీదేవికి కొత్తగా పెళ్లైంది. కొత్త కాపురం హాయిగా సాగిపోతోంది. అయితే అంతలోనే విధి చిన్నచూపు చూసింది. ఓ రోజు రైతు పొలంలో ఫీజు కట్టేందుకు వెళ్లిన గోవింద్.. అనుకోకుండా కరెంట్ షాక్‌కు గురయ్యారు. ఎత్తు నుంచి కింద పడటంతో వెన్నెముక విరిగింది. కొన్ని నెలల పాటు ఆస్పత్రికే పరిమితం కావాల్సి వచ్చింది. కొత్త కాపురంపై కోటి ఆశలతో ఉన్న ఆ జంటకు అంతలోనే మరో చేదువార్త. గోవింద్ ఇక జీవితాంతం మంచానికే పరిమితం కావాల్సిందేనని.. లేచి తిరిగే అవకాశాలు లేవని వైద్యులు తేల్చేశారు. నిండు నూరేళ్లు కలిసి జీవిద్దామనుకున్న ఆ దంపతులు.. ఈ మాటతో నిరాశలో కూరుకుపోయారు. కానీ అంతటి విపత్కర పరిస్థితులలోనూ గోవింద్ తన స్వార్థం చూసుకోలేదు. తనను నమ్మి వచ్చిన అమ్మాయి జీవితం గురించే ఆలోచించారు.పాతికేళ్ల వయసులోనే మంచానికి పరిమితం కావాల్సి వచ్చినందుకు తన దురదృష్టాన్ని నిందించుకున్నారు. తన దురదృష్టం తన భార్య పాలిట శాపం కాకూడదని భావించారు. ఆమె జీవితాన్ని తన స్వార్థం కోసం ఎందుకు నాశనం చేయాలని ఆలోచించారు. తన భార్యకు మరో పెళ్లి చేయాలని సంకల్పించుకున్నారు. రెండో వివాహమంటే ఇవాల్టి రోజుల్లో సాధారణమే కానీ.. 1999లో పరిస్థితులు వేరే. భర్త ఉండగానే మరో పెళ్లి అనేది మధ్యతరగతి కుటుంబాలు ఆలోచించడానికి కూడా సాహసం చేయని అంశం. అలాంటి రోజులలో భార్యను, అత్తామామను ఒప్పించి తన భార్యకు రెండో పెళ్లి చేశారు గోవింద్. తనకు ఇచ్చిన కట్నం డబ్బులు అన్నీ ఇచ్చేసి ఆలికి రెండో పెళ్లి చేశారు. సొంత సుఖం చూసుకునే స్వార్థపూరిత ప్రపంచంలో.. భార్య భవిష్యత్తు కోసం తన ప్రేమను త్యాగం చేసిన గోవింద్.. ప్రేమించడమంటే దగ్గరగా ఉండటం కాదు.. అవతలి వ్యక్తి ఆనందం కోసం దూరం కావడం కూడా ప్రేమేనన్న ఓ సందేశాన్ని తన కథ ద్వారా ప్రపంచానికి తెలియజేశారు. మంచానికే పరిమితమైన గోవింద్.. దేవుణ్ని నిందిస్తూ ఉండిపోలేదు. ఇంకొకరి భారం కాకూడదనే ఉద్దేశంతో చిన్నచిన్న టీవీ రిపేర్లు చేస్తూ ఖర్చులకు డబ్బులు సంపాదించుకుంటున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అలా పనిచేస్తూ మరొకరి భారంగా మారకుండా బతుకుతున్నారు. జీవితంలో ఇన్ని కష్టాలను చవిచూసిన గోవింద్.. పనిలో ఉంటే అవన్నీ గుర్తుకు రావంటున్నారు.. పనిలోనే విశ్రాంతిని, ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. అయితే ఇంతా చేసి భార్యకు రెండో పెళ్లి చేస్తే.. అక్కడ కూడా ఆమెకు మనశ్శాంతి లేదని సుమన్ టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో గోవింద్ తన ఆవేదన వ్యక్తం చేశారు. రెండో భర్తకు మద్యం అలవాటు ఉందని.. తాగొచ్చి వేధిస్తున్నాడని తనను చూసేందుకు వచ్చిన సందర్భంలో వాపోయిందని చెప్తున్నారు.