రామ్ చరణ్ హీరోగా నటించిన 'పెద్ది' సినిమా బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. మరోవైపు సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్ర చిత్రీకరణ, ఐటమ్‌ సాంగ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు చెబుతో.. అభ్యంతరాలు వ్యక్తమైన జాన్వీ సీన్స్ డిలీట్ చేశారు. ఇక 'హెల్లల్లో' పాట రాసిన గీత రచయిత అనంత్ శ్రీరామ్ పై నెట్టింట పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. దేనిపై ఆయన తాజాగా స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు.'పెద్ది' రిలీజైన తర్వాత కూడా సినిమాని ఇంకా జనాల్లోకి తీసుకెళ్లడానికి పెద్దగా ప్రమోట్ చేస్తున్న మేకర్స్.. ఆదివారం సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. దీనికి డైరెక్టర్ బుచ్చిబాబు, నిర్మాత వెంకట సతీష్, లిరిసిస్ట్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘పెద్ది’లోని ఐటమ్‌ సాంగ్‌పై వస్తున్న విమర్శల గురించి జర్నలిస్టులు ప్రస్తావించారు. దీనికి అనంత్‌ శ్రీరామ్‌ సమాధానమిస్తూ.. ఐటెమ్ సాంగ్‌ను ఐటెమ్ సాంగ్‌లాగే ఆస్వాదించాలన్నారు. సాహిత్య విలువలు తెలిసినవాళ్లు, అర్థం చేసుకునే వాళ్లతో సమస్య లేదని.. వాళ్ళు ఏది అడిగినా సమాధానం ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఈ క్రమంలో విమర్శకులపై ఆయన పరుష పదజాలం వాడటం వివాదానికి దారితీసింది. ''ఐటెమ్ పాటని ఐటెమ్ సాంగ్‌లాగా ఆస్వాదించినోళ్లకి ఒక స్పెషల్ ఐటెం రుచి చూపించినట్టు. ఐటెమ్ సాంగ్‌ని ఐటెమ్ సాంగ్‌లాగా ఆస్వాదించని వాళ్లే ఐటెం గాళ్ల కింద లెక్క. ఆరోపణ అనేది నిర్దిష్టంగా ఉండాలి. మనకి వచ్చిన భావోద్వేగాన్ని ఏదో అరిసేయడానికో.. లేకపోతే ప్రత్యేకంగా ఎజెండా పెట్టుకుని మాట్లాడితే దానికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. తాత్వికంగా ఆలోచించగలిగే వాళ్లు, తార్కికంగా మాట్లాడగలిగే వాళ్లు ఎవరైనా ఏ వాక్యం మీద ఏ ఆరోపణ నిర్దిష్టంగా చేసినా.. నిఖార్సైన సమాధానం ఇవ్వడానికి నిజాయితీగా సిద్ధంగా ఉన్నాను'' అని అనంత్ శ్రీరామ్ అన్నారు. ''రచయితకు అవధులు ఉండకూడదు. ఏ గీతానికి ఏ అవధులు ఉండవు. ఆలోచనా శక్తి, ఊహాశక్తే అవధి'' అని పేర్కొన్నారు. జాన్వీ కపూర్ పాత్రపై వచ్చిన విమర్శలకు బుచ్చిబాబు క్షమాపణలు చెప్పడాన్ని అందరూ ప్రశంసిస్తుంటే.. అనంత్ శ్రీరామ్ మాత్రం దర్శకుడు క్షమాపణలు చెప్పడం తనకు నచ్చలేదని అంటున్నారు. ''ఒక పాత్ర ఎలా ప్రవర్తిస్తుంది? అనేది దర్శకుడి ఊహ. ఇంగ్లీష్ బాగా వచ్చి, పీహెచ్‌డీ, పట్టభద్రులైన వారు మాట్లాడిందే నిజమని, వారి ఆలోచనా విధానమే సరైంది అనేది ఎక్కువ అయిపోయింది. సోషల్‌ మీడియాలో బాగా మాట్లాడేవాళ్ల అభిప్రాయాలు ఇతరులపై రుద్దబడి ప్రభావితం అవుతున్నారు. దర్శకుడికి ఒక పాత్ర ఇలా ప్రవర్తిస్తుంది అనే ఈ మాత్రం స్వేచ్ఛ కూడా ఇవ్వకపోతే మనం సృజనాత్మకతకు ఏం చేసినట్టు?''''వైటల్ అట్రాక్షన్, హార్మోనల్ రియాక్షన్స్.. ఇలాంటి పెద్ద పదాలు వాడితే చాలా ఈస్తటిక్ గా తీసినట్టు అద్భుతం అంటారు. అదే ముట్టేస్తా అని ట్రైబల్ భాష మాట్లాడితేనేమో వల్గారిటీ అంటారు. ఇలాగే విమర్శిస్తే దర్శకుల సృజనాత్మకతను తొక్కేసినట్లే. బుచ్చిబాబు ఎంతో సంస్కారంతో, కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయని, ఎవరినీ బాధ పెట్టకూడదని ప్రజాస్వామ్యబద్ధంగా బుచ్చిబాబు సారీ చెప్పి ఉండొచ్చు. కానీ నాకు నచ్చలేదు. ఇలాగే జరుగుతూ ఉంటే, భవిష్యత్‌లో డాక్యుమెంటరీలు తప్ప, కమర్షియల్‌ సినిమాల్లో గొప్ప పాయింట్స్ చెప్పలేం'' అంటూ అనంత్‌ శ్రీరామ్‌ కాస్త ఘాటుగా సమాధానమిచ్చారు.''వారానికి వెయ్యి నాకోసం దాయి.. నెలకోసారైనా నీకిట్టా ఈ హాయి.. అరకాసులు తియ్యి అరవంకీలు ఎయ్యి.. స్వర్గానికి దారి చూపిట్టాం వచ్చేయి'' అంటూ 'పెద్ది' ఐటెం సాంగ్ లో రాసిన సాహిత్యంపైనా అనంత శ్రీరామ్ వివరణ ఇచ్చారు. ''వారానికి వెయ్యి దాస్తే ఈ ఎంటర్టైన్మెంట్ కోసం 4 వేలు టికెట్.. అక్కడ కనిపించింది నృత్యమే. మైథునం(స్త్రీ-పురుషుల మధ్య శారీరక సంయోగం)గా భావిస్తే.. అది వాళ్ల ప్రవృత్తి అయ్యుండొచ్చు. నాకు తెలియదు. నేను అనుకున్న వెయ్యికి అర్థం చప్పట్లు. వారానికి వెయ్యి చప్పట్లు దాచుకొని, నెలకి నాలుగు వేల చప్పట్లు కొట్టండి ఈ నృత్యానికి'' అంటూ తన లిరిక్స్ కి సరికొత్త అర్థం చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐటెం సాంగ్ ఆస్వాదించలేని వాళ్ళు ఐటెంగాళ్ళు అంటూ ప్రేక్షకులను ఉద్దేశించి కామెంట్స్ చేయడంపై నెటిజన్లు అనంత శ్రీరామ్ ను ట్రోల్ చేస్తున్నారు.