స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో సర్టిఫికేట్లు తీసుకుంటున్నారా.. ఈ మార్పులు గమనించండి..

Wait 5 sec.

సాధారణంగా కుల ధ్రువీకరణ పత్రమో.. జనన ధ్రువీకరణ పత్రమో కావాలంటే ఏం చేస్తాం.. గతంలో అయితే తహశీల్దారు కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరిగేవాళ్లం. ఇప్పుడు పౌర సేవలు మరింత సులభతరమయ్యాయి. మీ సేవా కేంద్రాలు, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలను సంప్రదిస్తున్నాం. వీటి ద్వారా ధ్రువపత్రాలు పొందుతున్నాము. అయితే ధ్రువపత్రాల కోసం స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాలు, మీ సేవా సెంటర్లకు వెళ్లే వారికి ముఖ్య గమనిక. ఏపీ ప్రభుత్వం ధ్రువపత్రాలకు సంబంధించిన స్టేషనరీ మార్చింది. ధ్రువపత్రాలలో మార్పులు చస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉండేవి. ఏవైనా ధ్రువపత్రాలు కావాలంటే సచివాలయాల పేరుమీదే వాటిని జారీ చేసేవారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాలుగా మార్చింది. ఈ క్రమంలోనే పాత పేర్లతో ఉన్న ధ్రువపత్రాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ధ్రువపత్రాలను ఇక మీదక స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల పేరుతో జారీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే మీ సేవా కేంద్రాలు, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలకు కొత్త స్టేషనరీని జారీ చేసింది. ఇకపై పాత స్టేషనరీ ద్వారా సర్టిఫికేట్లు జారీ చేయకూడదని స్పష్టం చేసిన ప్రభుత్వం.. వాటిని వెనక్కి తీసుకుంటోంది. కొత్త స్టేషనరీని ఉపయోగించి మాత్రమే ధ్రువపత్రాలను జారీ చేయాలని స్పష్టం చేస్తోంది. ఒకవేళ ఎవరైనా పాత స్టేషనరీని ఉపయోగించి సర్టిఫికేట్లు జారీ చేసినట్లు తేలితే వారి ఐడీలు బ్లాక్ చేస్తామని ఆదేశాల్లో స్పష్టం చేసింది. కొత్తగా తీసుకువచ్చిన స్టేషనరీలో ప్రభుత్వ రాజముద్ర ఉంటుంది. అలాగే క్యూఆర్ కోడ్, హోలోగ్రామ్ ఉంటాయి. దీంతో నకిలీ సర్టిఫికేట్లను అడ్డుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే సర్టిఫికేట్ వెనుక ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి.. ఆ ధ్రువపత్రాన్ని ఎప్పుడు, ఎక్కడ జారీ చేశారనే వివరాలను తెలుసుకునే అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో సర్టిఫికేట్లు తీసుకునే సమయంలో పాత స్టేషనరీతో ఇస్తున్నారా.. కొత్త స్టేషనరీని ఉపయోగిస్తున్నారా అనే విషయాన్ని గమనించుకోవాలి.