రాజకీయాలకు దూరంగా ఉంటున్న మాజీ ఎంపీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ అయ్యారు. తాజా పరిణామాలపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అందరితో పంచుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులతో పాటుగా దేశవ్యాప్తంగా పలు అంశాలపై స్పందిస్తున్నారు. ప్రధానంగా ఏపీకి సంబంధించిన రాజకీయ పరిణామాలతో పాటుగా ప్రభుత్వం పరంగా తీసుకుంటున్న నిర్ణయాలపై . పలు సందర్భాల్లో ఏపీ ప్రభుత్వానికి ఆయన కొన్ని సలహాలు ఇస్తున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి కొన్ని సలహాలు ఇచ్చారు విజయసాయిరెడ్డి.తాజా కాగ్ నివేదిక ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ఆందోళనకరమైన పరిస్థితిని ఆవిష్కరిస్తోందన్నారు విజయసాయిరెడ్డి. అన్ని రాష్ట్రాలలోకెల్లా అత్యధికంగా రూ. 60,285 కోట్ల రెవెన్యూ లోటును ఏపీ నమోదు చేయగా.. 365 రోజులకు గాను 357 రోజులు ఆర్బీఏ రుణాలపై ఆధారపడిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను మళ్లీ సుస్థిరమైన మార్గంలోకి తీసుకురావాలంటే.. ఆర్థిక కార్యకలాపాలను పెంచి, అనవసర ఖర్చులను అరికట్టాల్సిన తక్షణ అవసరం ఉందని ప్రభుత్వానికి సలహా ఇస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు విజయసాయిరెడ్డి. ఇటీవల కాగ్ రిపోర్ట్ ప్రకారం.. దేశంలోని 16 రాష్ట్రాలు 2024-25లో చేబదుళ్లు, ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌలభ్యాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నుంచి వినియోగించుకున్నాయి. వీటిలో పంజాబ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు 62% వినియోగించుకున్నాయి. పంజాబ్‌ 365 రోజులు, తెలంగాణ 357 రోజులు చేబదుళ్లు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్‌ 357 రోజుల పాటు చేబదుళ్ల రూపంలో అప్పు తీసుకుంది. ఒక్క మాటల చెప్పాలంటే ఏడాది పొడవునా ఇలా చేబదుళ్లతోనే కొనసాగింది.. వీటికి వడ్డీ చెల్లించాలి. ఆంధ్రప్రదేశ్‌ 2024-25లో చేబదుళ్ల రూపంలో రూ. 1,72,532 కోట్లు తీసుకుంది. దేశంలో ఆంధ్రప్రదేశ్‌‌తో పాటుగా 12 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పింఛన్ల కోసం ఖర్చుపెడుతున్న మొత్తం కన్నా అప్పులపై వడ్డీ చెల్లింపులకే ఎక్కువ ఖర్చవుతోంది. కాగ్ రిపోర్ట్‌లోని ఈ అంశాలను మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రధానంగా ప్రస్తావించారు.. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.