హైదరాబాద్‌ సిగలో మరో మణిహారం.. 'ఉబర్' విస్తరణ.. అమెరికా వెలుపల మొట్టమొదటి సెంటర్

Wait 5 sec.

విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ సంస్థలు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కలల ప్రాజెక్టు అయిన ఫ్యూచర్ సిటీలో ఇంటర్నేషనల్ కంపెనీలకు ప్రభుత్వం ఆహ్వానం పలుకుతోంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డితో ఉబర్ సంస్థ ప్రతినిధుల బృందం జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో కీలక భేటీ నిర్వహించింది. ఈ భేటీలో ఉబర్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) దారా ఖోస్రోషాహి.. చీఫ్ బిజినెస్ ఆఫీసర్ (సీబీఓ) మధు కన్నన్.. ఇండియా అండ్ సౌత్ ఆసియా ప్రెసిడెంట్ ప్రభ్‌జీత్ సింగ్ సహా పలువురు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి కూడా హాజరయ్యారు.ఉబెర్ కార్యకలాపాలను తెలంగాణలో విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ఈ సందర్భంగా ఆ సంస్థ సీఈవో ఖోస్రోషాహి స్పష్టం చేశారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఉన్న ఉబర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను మరింత విస్తరణ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన వివరించారు. ఇది అమెరికా బయట ఏర్పాటు చేసే మొట్టమొదటి సెంటర్ అని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఈ సెంటర్‌లో 600 మంది ఇంజనీర్లు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. దీంతో పాటు.. హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో ఉబర్ కార్పొరేట్ ఆఫీస్‌ను నిర్మించేందుకు తాము ఆసక్తిగా ఉన్నామని ఉబర్ ప్రతినిధులు తెలిపారు.ఈ భేటీ సందర్భంగా ఉబర్ సంస్థ ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి ఒక వినూత్న సూచన చేశారు. దేశంలోని ప్రముఖ మెట్రో నగరాల్లో రోజురోజుకూ పెరుగుతున్న పార్కింగ్ సమస్యను ప్రస్తావించిన ముఖ్యమంత్రి.. పార్కింగ్ బిజినెస్‌లోకి ఉబర్ సంస్థ వచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. అత్యాధునిక మల్టీ లెవల్ పార్కింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన పార్కింగ్ సెంటర్‌ల సూచనపై సానుకూలంగా స్పందించిన ఉబర్ సీఈఓ.. ఈ అంశంపై సమగ్ర అధ్యయనం చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ఉబర్ సంస్థ వ్యాపారాన్ని విస్తరించేందుకు.. మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వారికి భరోసా ఇచ్చారు.అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా డెవలప్ చేస్తున్న ఫ్యూచర్‌ సిటీ అంశాన్ని కూడా ఉబర్ ప్రతినిధులకు సీఎం వివరించారు. 30 వేల ఎకరాల్లో నిర్మించే ఈ ప్రపంచంలోనే ప్రత్యేకంగా ఉంటుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన 500 కంపెనీలను ఈ ఫ్యూచర్ సిటీకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే పలు సంస్థలు ఫ్యూచర్ సిటీలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకు వచ్చాయని వెల్లడించారు.